తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతూ వస్తుంది..ఆ పార్టీలో నేతలు కుమ్ములాటలు, రాజకీయ పోరులో వెనుకబడటం లాంటి అంశాలతో కాంగ్రెస్ పరిస్తితి ఇబ్బందిగా ఉంది. ఓ వైపు రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో జరుగుతున్నా సరే.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత ఊపు రావడం లేదు. పైగా బాగా పట్టున్న మునుగోడులో సైతం ఆ పార్టీ మూడో స్థానంలోకి పడిపోతుందని సర్వేలు చెబుతున్నాయి.
ఇలా పార్టీలో రకరకాల పరిస్తితులు ఉన్నాయి.. అదే సమయంలో పార్టీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా సాగుతుంది. ఇప్పటికే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళి..మునుగోడు బరిలో కూడా తలబడ్డారు. అయితే వెంకటరెడ్డి కూడా పార్టీ మారతారని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. పైగా కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయకుండా, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళి..అక్కడ నుంచి మునుగోడులో తన సోదరుడుకు ఓటు వేయాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు ఫోన్లు చేశారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. అలాగే షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, వాటిపై వివరణ ఇవ్వాలని కోరారు. 10 రోజులైనా స్పందన లేదు..దీంతో మరోసారి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటిసులు వెంకటరెడ్డి వివరణ ఇస్తారో లేదో క్లారిటీ లేదు. ఒకవేళ నోటీసులకు స్పందించకపోతే కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసే ఛాన్స్ ఉంది.
ఇక పార్టీ మారడం కంటే వేటు వేయించుకుని బయటకు వెళ్ళడం బెటర్ అని కోమటిరెడ్డి వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చిన సరే పార్టీ కార్యక్రమాల్లో ఉండటం లేదు. రాహుల్ జోడో యాత్రకు దూరంగా ఉన్నారు. దీని బట్టి చూస్తే వెంకటరెడ్డి.. వేటు వేసే వరకు ఆగి, ఆ తర్వాత వేరే పార్టీలోకి జంప్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వెంకటరెడ్డి బీజేపీలో చేరిక ఖాయమే అని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. మరి వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.