జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర చేశారనే వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ముప్పు పొంచి ఉందని, ఆ ముప్పు నుంచి ఆయనను కాపాడే దిశగా పవన్ కు తగినంత భద్రత కల్పించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ మేరకు తాను అమిత్ షాకు లేఖ రాసిన విషయాన్ని రఘురామరాజు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా అమిత్ షాకు తాను రాసిన లేఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందినట్లుగా తన లేఖకు చెందిన కాపీని కూడా తన పోస్టుకు జత చేశారు రఘురామకృష్ణ. ఈ లేఖలో పవన్ కు ఎదురైన వరుస ఘటనలను రఘురామరాజు తన లేఖలో అమిత్ షాకు వివరించారు.
గత నెల 21తో పాటు ఈ నెల 1న హైదరాబాద్ లోని పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తచ్చాడారని, పవన్ బౌన్సర్లతో గొడవకు దిగారని కూడా పేర్కొన్నారు రఘురామకృష్ణ. అంతేకాకుండా ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా పవన్ కు ఎదురైన అనుభవాలను కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఈ ఘటనలను పరిగణనలోకి తీసుకుని ముప్పు నుంచి పవన్ కు రక్షణ కల్పించేలా తగినంత భద్రతను కల్పించాలని అమిత్ షాను కోరారు రఘురామకృష్ణ.