టీడీపీ నుంచి అనూహ్యంగా కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన యువ నాయకుడు, తెలంగాణ రాజకీయ నేత… రేవంత్‌రెడ్డి ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ ఎస్ ను టార్గెట్ చేయడంలోను, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేయడంలోను రేవంత్ తనదైన దూకుడు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన వస్తానంటే.. కాంగ్రెస్ వద్దనలేదు. పైగా 2018 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. ఎక్కడా ప్రభావం తగ్గిపోలేదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏరికోరి ఆయనకు మల్కాజ్ గిరి నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చింది.
ఈ పరిణామంతో ఇక.. రేవంత్ పరిస్థితి అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, సమీకరణలు కలిసి వచ్చి.. ఎంపీగా రేవంత్ గెలుపు గుర్రం ఎక్కారు. పార్లమెంటులోనూ తన వాయిస్ వినిపించారు. ఇక, కరోనా సమయంలో ప్రబుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని కూడా ఎండగడుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు అసలు చిక్కు వచ్చిపడింది. తన దూకుడే తనకు శత్రువుగా మారింది. సీనియర్లను లెక్కచేయకుండా.. తనదైన శైలిలో రేవంత్ దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. దీంతో పైకి మాత్రం సీనియర్లు ఆయనను విమర్శించకపోయినా.. అవకాశం వస్తే.. వెనక్కి నెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి వారికి ఇప్పుడు అవకాశం వచ్చేసింది. అదే పీసీసీ పీఠం పగ్గాలు. ప్రస్తుతం తెలంగాన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఇప్పటికే ఒకసారి రెన్యువల్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయనన నియమించారు. అయితే, మరోసారి కూడా ఆయననే కొనసాగించారు. అయితే, రెండుసార్లు కూడా పార్టీ అధికారంలోకి రాలేక పోయింది. ఆశించిన మెరుగుదల కూడా ఉత్తమ్ చూపించలేక పోయారు. అధికార పార్టీ దూకుడుకు పగ్గాలు వేయలేక పోయారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మార్చేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఈ పీఠం కోసం ఎంతో మంది లైన్లో ఉన్నా.. రేవంత్ కూడా పోటీ చేస్తున్నారు.
తనకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఉన్న పరపతిని వినియోగించుకుని పీసీసీ పీఠం ఎక్కాలని నిర్నయించుకున్నారు. కానీ, రేవంత్‌కు ఇప్పుడు సీనియర్ల సెగ బాగా తగులుతోంది. ఆయనకు అవకాశం ఇవ్వవద్దని పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు, జగ్గారెడ్డి పలుమార్లు అధిష్టానానికి సూచించారు. ఆయనకిస్తే తమ రాజకీయ నిర్ణయం తాము తీసుకుంటామని హెచ్చరించారట కూడా. దీంతో ఇప్పుడు రేవంత్ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఆయన సీనియర్లను కలుపుకొని వెళ్లడంలోను, పార్టీ లైన్‌కు అనుగుణంగా వ్యవహరించడంలోనూ లోపాలు ఉన్నాయని అంటున్నారు. అవే ఇప్పుడు శాపాలుగా మారాయని చెబుతున్నారు. మరి పీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి.