హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీలో దుమారాన్ని రేపుతోంది. నేతల మధ్య మాటల మంటలను రాజేస్తోంది. ఓటమిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, పొన్నం వంటి నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు ఓటమి బాధ్యత నేనే తీసుకుంటా అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ నేతల విమర్శల నేపథ్యం.. ఘోర పరాజయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ నేడు ఓటమిపై చర్చించనున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మధుయాష్కీ తో పాటు మిగతా నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
కాగా హుజూరాబాద్ ఉపపోరు కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చింది. వారిలో ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుకూలం, వ్యతిరేఖ వర్గాలుగా నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పరాజయంపై ఒకరినొకరు నిందించుకుంటున్నారు. గతంలో 2018 ఎన్నికల్లో 61 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో అవమానకర రీతిలో కేవలం 3014 ఓట్లకే పరిమితం కావడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. డిపాజిట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. దీంతో నేడు జరిగే కాంగ్రెస్ నేతల సమావేశం ఆసక్తికరంగా మారింది.