రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని తగ్గించే క్రమంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రయోగించింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే, కొందరు అవగాహన లేకో.. లేక ఇంట్లోనే ఉండి.. ఉండి విసిగెత్తిపోయే.. బయటకు వస్తున్నారు. అయితే, వీరికి అవగాహ న కల్పించాల్సిన పోలీసులు రెచ్చిపోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. డీఎస్పీ, సీఐ స్థాయి వారే దండధరులుగా మారి తమ కండ ప్రతాపం చూపిస్తున్నారని ప్రజలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు. తాజాగా ఒక జిల్లాలో జరిగిన పోలీసుల వీర ప్రతాపం సభ్య సమాజాన్ని ముక్కున వేలేసుకునే లా చేసింది. ముగ్గురు యువకులకు వంగో బెట్టి మరీ వారి పిరుదులపై ఇష్టానుసారం తమ కండ కావరాన్ని తీర్చుకున్న ఓ పోలీసు వ్యవహారన్ని సోషల్ మీడియాలో ప్రజలు తీవ్రస్థాయిలో నిరసిస్తున్నారు.
ఏ ముఠా దొంగల్నో, కరడుగట్టిన రౌడీలనో కొట్టినట్టుగా వ్యవహరించడం ఏ మేరకు సబబనేది ప్రజల ప్రశ్న. లాక్‌డౌన్ సమయం లో రాష్ట్ర పోలీసుల వీర కౌశలాన్ని ప్రశంసిస్తూ.. డీజీపీ సవాంగ్ పోలీసులకు వందనాలు సమర్పించాలని ఉందంటూ.. నాలుగు పేజీల లేఖ రాశారు. తండ్రిలా ప్రజలను మందలిస్తున్నారంటూ.. పోలీసులకు కితాబులిచ్చారు. అయితే, క్షేత్రస్థాయిలో జరుగుతు న్న పరిణామాలను గమనిస్తే.. తండ్రి ఇలానే మందలిస్తారా? కసితీరా కొట్టి.. కర్కశంగా వ్యవహరిస్తాడా? అనేది డీజీపీకి తెలుస్తుం ది. నిజానికి ఇప్పుడేమైనా మత ఘర్షణల కారణంగానో.. దొమ్మీల కారణంగానో.. ఏ రాజకీయ నాయకుడి హత్య కారణంగానో కర్ఫ్యూ జరుగుతోందా? ఎంత మాత్రమూ లేదే! కేవలం ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే క్రతువులో భాగంగా జరుగుతున్న ప్రభుత్వాల వైఫల్యం కారణంగా జరుగుతున్న ప్రజలు అనుభవిస్తున్న లాక్‌డౌన్ లేదా జనతా కర్ఫ్యూ!!
ఈ సమయంలో సంయమనం పాటించాల్సిన నాలుగో సింహం.. ఆ బిరుదుకు కూడా కళంకం తెచ్చేలా వ్యవహరించడం ఏమేరకు సబబో డీజీపీ ఆలోచించుకోవాలని అంటున్నారు ప్రజలు. ప్రజలను కొట్టేందుకే ఖాకీ దుస్తులు వేసుకున్నామని తీర్మానం చేసుకున్నట్టుగా వ్యవహరిస్తున్న పోలీసులు.. అసలు పోలీసులు ప్రజలతో ఎలా వ్యవహరించాలో.. ఆపత్కాలంలో ఎలా ప్రజలకు చేరువకావాలో ఘోషిస్తున్న పోలీసు మాన్యువళ్లను బుట్టదాఖలు చేస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను, దశ-దిశలను కూడా నడివీధి లాఠీ పెత్తనంతో నాడా బూట్ల కింద నలిపేస్తున్నారు. కారణాలు కనుక్కునే తీరిక కానీ, ప్రజల అవసరాలు కానీ పట్టించుకునే ఓపిక కానీ లేని పోలీసులు.. ప్రస్తుత లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలపై చేస్తున్న దుర్నిరీక్ష్య లాఠీ పెత్తనం సర్వత్రా విమర్శలకు, ఖాకీ మారదింతే అనే వ్యాఖ్యలకు ఆస్కారం ఇస్తోంది. అంతేనా.. హనుమాన్ జంక్షన్‌లో సలహా ఇవ్వబోయిన పాత్రికేయులపైనే డీఎస్పీ స్థాయి అధికారే కర్రపెత్తనం చేయడం అహంకారానికి నిదర్శనం కాక మరేంటి?
అయితే, పొలీసులు అందరూ ఇలానే ఉన్నారా? అంటే.. కొన్ని చోట్ల ఐపీఎస్ సత్యనారాయణ వంటివారు మనం ఉన్నది సేవా దృక్ఫథం అనే మాటలను నిజం చేస్తున్నారు. లాఠీ ఉన్నది అమాయక ప్రజలపై పెత్తనం చేయడానికి కాదని నిర్వివాదంగా చెప్పే సత్యనారాయణ వంటి వారు పోలీసులకు ఆదర్శమే అయినా.. కొందరు చేస్తున్న అతి ప్రవర్తన కారణంగా.. మొత్తం శాఖే నేడు నడివీధిలో నిస్సిగ్గు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత నిరంకుశ వైఖరిని అవలంభించడం ఏపీ పోలీసుల నుంచే చూస్తున్నాం.. అంటూ.. కొన్ని రోజుల కిందట సాక్షాత్తూ హైకోర్టు వ్యాఖ్యానించిన మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అయినా పోలీసుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితి ఎంద దయనీయమో.. అంతే దయార్ద్రంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం.. సంబంధిత మంత్రి కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించనంత వరకు అమాయకుల పిరుదులు, చేతులపై లాఠీల కరాళ నృత్యం కొనసాగుతుందనడంలో సందేహం లేదు.