కరోనా ఫైటర్‌ – కేసీఆర్‌

-

భయంతోనో, నిర్లక్ష్యంతోనో, నిర్వేదంతోనో, అవగాహనాలేమితోనో భారత నాయకులు రకరకాలుగా మాట్లాడుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం సైలెంట్‌గా యాక్షన్‌లోకి దిగారు.  అదీ పక్కా ప్రణాళికతో, నిబద్ధతతో.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. నేటికి 21 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క మృతి కూడా లేదు. ఈ వ్యాప్తి కూడా విదేశాల నుండి వచ్చిన వారికే తప్ప స్థానిక ప్రజలకు ఒక్కరికి కూడా సోకలేదు. రెండుమూడు రోజుల క్రితం కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియన్ల వల్ల కొంత భయభ్రాంతులు పుట్టినప్పటికీ, ప్రభుత్వం చాలా సీరియస్‌గా, వేగంగా నిర్ణయాలు, చర్యలు తీసుకోవడంతో అక్కడ ఇప్పటికీ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా విషయాలలో ఎంతో లోతైన అవగాహన ఉన్న వ్యక్తి. తనకు తెలియని విషయం ఎదురుపడ్డప్పుడు దాని గురించి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. విషయం తెలియకుండా ఒక్క మాట కూడా మాట్లడరు. చాలామందికి, ఆ రంగంలో నిష్ణాతులైన వారికి కూడా తెలియని కొన్ని విషయాలపై ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన మేధస్సు, ఆలోచనావిధానంతో దగ్గరివాళ్లను, రోజూ మాట్లాడేవారిని కూడా ఆశ్చర్యచకితులను చేస్తుంటారు. అద్భుతమైన జ్ఞాపకశక్తి కూడా ఆయనకో వరం. పదేళ్ల తర్వాత కలిసిన వ్యక్తినైనా పేరుపెట్టి పిలపగలగడం ఆయన గొప్పతనం.

తెలంగాణలోకి కరోనా ప్రవేశించినప్పటినుంచే కేసీఆర్‌ దాని గురించి మాట్లాడుతున్నారని చాలామంది అనుకుంటున్న విషయం నిజం కాదు. చైనాలో అది పుట్టిందని తెలిసినప్పటినుండే చాలా క్లోజ్‌గా కరోనా విషయాలను ఆయన ఫాలో అవుతున్నారు. అది ఎక్కడ, ఎలా మొదలైంది? ఎలా వ్యపిస్తోంది? ఎంతటి విధ్వంసం సృష్టించగలదు? ఏయే దేశాల్లో ఎటువంటి ప్రభావం చూపగలదు? ఇక్కడికి వస్తే మన పరిస్థితేమిటి? ఎలా తట్టుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై చాలా తీవ్రంగా ఆయన ఆలోచించారు. కాకపోతే ఇది ఎవరికీ తెలియదు. ఆయన కరోనా గురించి మాట్లాడిన ప్రతీసారి చాలా జాగ్రత్తగా మాట్లాడారు. శాసనసభలో కానీ, విలేకరుల సమావేశాల్లో కానీ, చాలా నింపాదిగా, హుందాగా, ఎంతో మనోనిబ్బరంతో ప్రసంగించారు.

కరోనా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను కూడా కేసీఆర్‌ ఒక పక్కా ప్రణాళికతో పద్ధతి ప్రకారం విడుదల చేస్తూఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఇక్కడి ప్రజల జీవనస్థితిగతులను అర్థం చేసుకున్నవాడిగా నిర్ణయాలు ఒకదాని తర్వాత ఒకటిగా తీసుకున్నారు. ప్రజలను భయభ్రాంతులను చేయగూడదని, వారి జీవనశైలిని దెబ్బతీయగూడదని ఆయన ఆలోచన. అధికారులకు కూడా ఆయన ఒక పద్దతి ప్రకారం ఆదేశాలిచ్చారు. ఇదేంటి? ముఖ్యమంత్రి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడంలేదు అనుకున్నవారందరికి ఆయన ప్రణాళిక అర్థం కాలేదు. తెలంగాణతో కరోనా ప్రవర్తనను చాలా దగ్గరినుండి ఆయన గమనిస్తూ, తదనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు తప్ప, ఒకేసారి కర్ఫ్యూలాంటిది పెట్టి ప్రజలను బెంబేలెత్తించడం చేయలేదు. ఇక్కడ చాలామంది రెక్కాడితేనే కానీ, డొక్కానివారు కోకొల్లలు. రోజువారీ పనులకు బయటకు వెళ్లకపోతే రాత్రికి తిండిలేని పరిస్థితి ఎందరిదో. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్లోకి వెళ్లకపోతే ఆ రైతుకు ఎంత నష్టమో ఈ రైతుకు బాగా తెలుసు. ప్రజలను మెల్లమెల్లగా ‘ప్రిపేర్‌’ చేయడం ఆయన ఎంచుకున్న మార్గాల్లో ఒకటి. నిజానికి కేసీఆర్‌ ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉన్నారు. సునామీ స్థాయి విపత్తుకు కూడా ఆయన చాలారోజుల క్రితమే తయారైపోయిఉన్నారు. సిసిఎంబీలో రోజుకి వెయ్యి నమూనాలను పరీక్షించవచ్చని ఇక్కడి ప్రభుత్వ, ప్రయివేటు శాస్త్ర-వైద్యరంగ నిపుణులకు కూడా తెలియదు. కానీ కేసీఆర్‌కు తెలుసు. ఇది చాలు, ఆయన ఆలోచనావిధానం, తార్కికశక్తి ఎంత గట్టివో.

కేసీఆర్‌ ఇప్పుడు కరోనాతో నువ్వా? నేనా? తేల్చుకోవాలనుకుంటున్నారు. ఢీ అంటే ఢీ అనబోతున్నారు. అది ఎంత పెరిగితే ఈయనా అంతే పెరుగుతున్నారు. ‘‘మీకు పరిస్థితి అర్ధం కావడంలేదు’’ అంటున్న శాస్త్ర, వైద్యరంగ ప్రముఖులకు అర్ధం కానిదేంటంటే, ఆయనకు కరోనా ప్రభావం తెలంగాణపైనే కాదు, భారతదేశంపైన కూడా ఎలా ఉండబోతోందన్న దానిపై సుస్పష్టమైన అవగాహన ఉంది. కేవలం కనిష్ట నష్టంతో దీనినుంచి ఎలా బయటపడాలన్నదే ప్రస్తుతం కేసీఆర్‌ ఆలోచనంతా.

ఆనాడు లంకకు లంకిణి కాపలా ఉంటే, నేడు తెలంగాణకు హనుమంతుడే రక్షగా ఉన్నాడు. సముద్రాలు దాటివచ్చిన కరోనా లంకిణిని మట్టికరిపించడానికి కోట బయట సిద్ధంగా ఉన్నాడు. రా…! కరోనా.. వచ్చి చచ్చిపో…!

 

చంద్రకిరణ్‌

Read more RELATED
Recommended to you

Latest news