భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా. గత 24 గంటల్లో దేశంలో 18,522 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అదే సమయంలో 418 మంది మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,66,840కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,893కి పెరిగింది. 2,15,125 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,34,822 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 86,08,654 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది.