హైదరాబాద్ కోఠి లోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ప్రజలు కరోనా నిబంధనలను సమర్థవంతంగా పాటించకపోతే కొత్త వేరియంట్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డెల్టా తగ్గినా ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం కారణంగా కొత్త వేరియంట్ వస్తే ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొత్త వేరియంట్ వస్తే ప్రజలు, ప్రభుత్వం తట్టుకోవడం కష్టం అని అన్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. ఫస్ట్ డోస్ తీసుకున్న 36.35 లక్షల మంది కరోనా సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలని చెప్పారు. రెండు వ్యాక్సిన్ లు తీసుకుంటే పూర్తి రక్షణ పొందవచ్చు అని చెప్పారు. రాష్ట్రంలో 80 శాతం మంది మాస్కులు ధరించడం లేదని ఇలా చేస్తే ప్రమాదం అని హెచ్చరించారు. అంతేకాకుండా రెండు మూడు వారాల్లో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు ఇస్తామని స్పష్టం చేశారు.