రాజస్థాన్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడటంతో కొందరు దుండగులు టీకాల చోరీకి పాల్పడ్డారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యశాఖ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. దాదాపు 320 మోతాదుల కోవాగ్జిన్ దొంగలించబడిందని, చట్టవిరుద్ధంగా వ్యాక్సిన్ దొంగతనం చేసి రవాణా చేస్తున్న వారిపై కఠిన శిక్షలు విధించాలని ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే ప్రస్తుతం కేసుల తీవ్రత ఎక్కువ అవడంతో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ దొంగిలించబడిన ఫస్ట్ కేసిది. అందుకే పోలీసులు కూడా ఈ దొంగతనాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు.
ఈ మేరకు పోలీసులు విచారణ మొదలు పెట్టారు. దొంగతనం జరిగిన ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆధారాలు సేకరించడంలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. దొంగతనం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు పని చేయడం లేదని గుర్తించారు. దీంతో పోలీసులు ఆస్పత్రిలో పని చేసే సిబ్బందే.. దొంగలకు సాయం చేసి ఉంటారని, ఈ మేరకు ఆస్పత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. కాగా, సోమవారం మధ్యాహ్నం నాటికి కోటి మందికిపైగా టీకాలు వేసిన రాష్ట్రాల జాబితా రాజస్థాన్ రెండవ స్థానంలో నిలిచింది. దీంతో రాష్ట్ర వైద్య సిబ్బందికి, వైద్యులకు.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రఘు శర్మ అభినందించారు. కరోనా నిర్మూలనకు ప్రజలు ముందుకు రావాలని, నిబంధనలు పాటిస్తూ.. వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు.
రాజస్థాన్‌లో ప్రతిరోజు సగటున 4.70 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన మొత్తంగా 5.44 లక్షల వ్యాక్సిన్, ఏప్రిల్ 6వ తేదీన 4.84 లక్షల వ్యాక్సిన్లు, ఏప్రిల్ 7వ తేదీన 5.81 లక్షల వ్యాక్సిన్లు, ఏప్రిల్ 8వ తేదీన 4.65 లక్షల వ్యాక్సిన్లు, ఏప్రిల్ 9వ తేదీన 4.21 లక్షల మంది బాధితులకు కరోనా వ్యాక్సిన్ వేశారు. అలాగే ఏప్రిల్ 9వ తేదీన 2.96 లక్షలు, ఏప్రిల్ 10వ తేదీన 1.11 లక్షల మందికి టీకాలు వేశారు. ఇలా దేశవ్యాప్తంగా అత్యధిక టీకాలు వేస్తున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ రెండవ స్థానంలో ఉంది.