చైనా దేశంపై కరోనా విసిరిన పంజా ప్రభావం ఇంకా తగ్గలేదు. ఇప్పటి వరకు అక్కడ 3వేల మందికి పైగా కరోనా వైరస్ వల్ల చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. లక్షల మంది కరోనా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా వైరస్ ఏమోగానీ దాని వల్ల చైనా ప్రజలకు ఒక మేలు మాత్రం జరిగింది. అదేమిటంటే..
కరోనా వైరస్ వల్ల చైనాలో ఇప్పటికే అనేక ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, కార్యాలయాలు మూతపడగా, రహదారులపై తిరిగే వాహనాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. దీంతో అక్కడి వాతావరణంలో ఎన్‌వో2 (నైట్రోజన్ డయాక్సైడ్) స్థాయిలు పూర్తిగా పడిపోయాయి. ఈ మేరకు అమెరికాకు చెందిన నాసా, యూరప్‌కు చెందిన యురోపియన్ స్పేస్ ఏజెన్సీలు పలు ఉపగ్రహ చిత్రాలను తాజాగా విడుదల చేశాయి. కరోనా వైరస్ రాక ముందు, వచ్చిన తరువాత చైనాపై ఎన్‌వో2 ప్రభావం ఎలా ఉందో వివరిస్తూ పలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటిల్లో ఎన్‌వో2 స్థాయిలు దాదాపుగా పూర్తిగా తగ్గి ఉండడాన్ని మనం గమనించవచ్చు.
సాధారణంగా ఎన్‌వో2 అనేది ఓ కాలుష్య కారకం. ప్రస్తుతం ప్రపంచలోని అనేక దేశాల్లోని నగరాలు, పట్టణాల్లో ఈ కెమికల్ స్థాయిలు పెరుగుతున్నాయి. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే కరోనా వైరస్ కారణంగా చైనాలో జనజీవనం దాదాపుగా స్తంభించిపోవడం, పరిశ్రమలు మూతపడడంతో అక్కడి వాతావరణంలో ఎన్‌వో2 స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. దీంతో అక్కడి గాలిలో కొంత వరకు నాణ్యత పెరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ముందు ముందు కరోనా వైరస్ కథ ముగిస్తే.. మళ్లీ అక్కడి వాతావరణంలో ఎన్‌వో2 స్థాయిలు యథాతథ స్థితికి చేరుకుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. అవును మరి.. పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే ఎప్పటికీ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సి ఉంటుంది..!