ఓ వైపు కరోనా విజృంభణ… మరో వైపు దగ్గర పడుతున్న టీకాల నిల్వలు

-

దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో వీలైనంత మందికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా పెద్ద సంఖ్యలో కరోనా టీకాలు అందిస్తున్న నేపథ్యంలో… దేశంలో వ్యాక్సిన్ కొరత ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం వ్యాక్సిన్ కొరత లేదని సరిపడా టీకాలు ఉన్నాయని చెబుతోంది.


ఇది ఇలా ఉండగా తెలంగాణలో టీకా డోసుల నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మరో వారం రోజులకు సరిపడా టీకాలు మాత్రమే ఉన్నాయని వైద్య శాఖ నుంచి సమాచారం. తెలంగాణకు సుమారు 24 లక్షలకు పైగా కొవిన్‌ టీకా డోసులు సరఫరా చేసారు. అయితే ఇందులో ఇప్పటివరకు 16.80 లక్షల డోసులు పంపిణీ చేయగా… మరో 8 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. అయితే కేంద్రం మార్గదర్శకాల మేరకు పెద్ద ఎత్తున టీకాలు పంపిణీ చేస్తే… మరో 7-8 రోజులకు మించి టీకాలు సరిపోవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం సత్వరమే స్పందించి టీకాలు పంపిణీ చేయాలని వైద్య వర్గాలు కోరుతున్నాయి. కేంద్రం స్పదించకపోతే రాష్ట్రంలో టీకా సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టీకా తీసుకోవడానికి అటు వైద్య సిబ్బంది, ఇటు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్‌ సిబ్బంది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. టీకా కోసం నమోదు చేసుకున్న వైద్య సిబ్బందిలో కేవలం 69 శాతం మంది, ఇతర ఉద్యోగులు 46.31 శాతం మాత్రమే తొలి డోసు తీసుకున్నారు. ఇక కొందరు రెండో డోసు తీసుకోపోవడానికి ముందుకు రాకపోవడంతో వైద్యవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తొలి డోసు తీసుకున్న 28 రోజులకు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తొలి డోసు తీసుకొని రెండో డోసు తీసుకోపోతే వ్యాక్సిన్ ప్రభావం ఉండదని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.31 శాతం టీకాలు వృథా అయినట్లు తెల్సింది.

Read more RELATED
Recommended to you

Latest news