కోవాగ్జిన్‌ సురక్షితమే.. ఫేజ్‌ 2 ట్రయల్స్‌ డేటాలో వెల్లడించిన భారత్‌ బయోటెక్‌..

-

కరోనా నేపథ్యంలో భారత్‌లో జనవరి 16వ తేదీ నుంచి పెద్ద ఎత్తున టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే దేశంలోని పౌరులకు కోవిషీల్డ్ తోపాటు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను కూడా ఇస్తున్నారు. కానీ ఈ వ్యాక్సిన్‌కు గాను అప్పటికి ఇంకా క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను వెల్లడించలేదు. అందువల్ల ఈ వ్యాక్సిన్‌ సురక్షితం కాదని అప్పట్లో అందరిలోనూ అనుమానాలు వచ్చాయి. కానీ ఆ అనుమానాలను పటా పంచలు చేస్తూ తాజాగా ఈ వ్యాక్సిన్‌కు చెందిన ఫేజ్‌ 2 ట్రయల్స్‌ డేటాను ప్రచురించారు. వాటిల్లో కోవాగ్జిన్‌ సురక్షితమేనని వెల్లడైంది.

covaxin is safe announced in 2nd phase trials data

దేశవ్యాప్తంగా 12 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 921 మందికి రెండో దశలో భాగంగా కోవాగ్జిన్‌ టీకాలను ఇచ్చారు. అయితే ఎవరిలోనూ దుష్ప్రభావాలు కనిపించలేదు. పైగా మొదటి డోస్‌ మాత్రమే తీసుకున్నా రోగ నిరోధక వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుందని గుర్తించారు. అందువల్ల కోవాగ్జిన్‌ సురక్షితమేనని ట్రయల్స్‌లో వెల్లడైంది. ఈ మేరకు ట్రయల్స్‌కు చెందిన వివరాలను ది లాన్సెట్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.

అయితే కోవాగ్జిన్‌కు సంబంధించి ఫేజ్‌ 3 ట్రయల్స్‌ కూడా పూర్తయ్యాయి. కానీ ఆ వివరాలను ఇంకా ప్రచురించలేదు. కాకపోతే ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ పనితీరును పరిశీలించారు. ఈ క్రమంలో కోవాగ్జిన్‌ 81 శాతం మేర ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది. కాగా చివరి దశ ట్రయల్స్ కు చెందిన వివరాలను కూడా త్వరలోనే ప్రచురించనున్నారు. ఇక మొదట్నుంచీ ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు కోవాగ్జిన్‌ సురక్షితమేనని చెబుతూ వచ్చారు. అదే ఇప్పుడు రుజువు కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news