కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో గురువారం (13-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. దేశవ్యాప్తంగా కొత్తగా 66,999 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23,96,638కి చేరుకుంది. 16,95,982 మంది కోలుకున్నారు. 6,53,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 47,033 మంది చనిపోయారు. దేశంలో కరోనా రికవరీ రేటు 70 శాతానికి చేరుకుంది. మరణాల రేటు 1.98 శాతంగా ఉంది.
2. తెలంగాణలో కొత్తగా 1931 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 298 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 86,475కు చేరుకుంది. కొత్తగా 11 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 665కు చేరుకుంది. 22,736 యాక్టివ్ కేసులు ఉండగా, 63,074 మంది కోలుకున్నారు.
3. ఫార్మా కంపెనీ జైడస్ కడిలా కోవిడ్ చికిత్సకు మరో మెడిసిన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్‌ను ప్రవేశపెట్టారు. ఈ మెడిసిన్ 100 మిల్లీగ్రాముల ఇంజెక్షన్ ధరను రూ.2800గా నిర్ణయించారు. రెమ్‌డాక్ పేరిట ఈ మెడిసిన్ మార్కెట్‌లో లభిస్తోంది.
4. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన అర్చకుడు నృత్య గోపాల్ దాస్ కరోనా బారిన పడ్డారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన మధుర వెళ్లగా అక్కడ కరోనా సోకింది. శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ క్రమంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
5. అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ ఇప్పటికే 3వ స్థానంలో ఉండగా.. అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. బ్రిటన్‌లో 46,705 మరనాలు నమోదు కాగా.. భారత్‌లో 47,033 మరణాలు సంభవించాయి. దీంతో భారత్ ఈ విషయంలో బ్రిటన్ ను దాటేసింది.
6. టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్, ఐపీఎల్ చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కరోనా టెస్టు చేయించుకున్నాడు. దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్ నేపథ్యంలో బీసీసీ సూచించిన మేరకు ప్లేయర్లు, సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ధోనీ కూడా కరోనా టెస్టు చేయించుకోగా.. రిజల్ట్ నెగెటివ్ అని వచ్చింది.
7. ఏపీలో కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,64,142కు చేరుకుంది. కొత్తగా 82 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,378కి చేరుకుంది. 1,70,924 మంది కోలుకున్నారు. 90,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
8. తమిళనాడులో కొత్తగా 5,835 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 119 మంది చనిపోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,355కు చేరుకోగా, 5,397 మంది చనిపోయారు. 2,61,459 మంది కోలుకున్నారు. 53,499 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
9. న్యూజిలాండ్‌లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. 102 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ తాజాగా కేసుల సంఖ్య 17కు చేరుకుంది. దీంతో అక్కడ మళ్లీ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు.
10. భూటాన్‌లో కరోనా కట్టడికి గాను తొలిసారిగా అక్కడ లాక్‌డౌన్ విధించారు. అక్కడ 21 రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది.