కరోనా వైరస్‌కు గాను వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు మన సైంటిస్టులు తీవ్రంగా శ్రమిస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. వ్యాక్సిన్ విడుదలైతే ముందుగా కోవిడ్ 19 వారియర్లకే దాన్ని అందిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు.
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో భాగంగా భారతీయులందరికీ ఒక్కొక్కరికీ ఒక్కో హెల్త్ ఐడీ కార్డు ఇస్తారని, దాంతో వారి ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో భద్ర పరుచుకోవచ్చని తెలిపారు. దీని వల్ల దేశంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి వైద్యులు త్వరగా చికిత్స అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. దేశ ప్రజలకు అందరికీ హెల్త్ ఐడీ కార్డులు ఉండడం శుభ పరిణామమన్నారు.
కాగా ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేశారు. దేశంలో ప్రస్తుతం 3 కరోనా వ్యాక్సిన్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని.. సైంటిస్టులు వ్యాక్సిన్‌లకు ఓకే చెప్పగానే.. వెంటనే వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తామని కూడా మోదీ ప్రకటించారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌పై భేటీ అయిన కేంద్ర నిపుణుల కమిటీ వ్యాక్సిన్‌ను ఎవరికి ముందుగా ఇవ్వాలి.. ఎలా పంపిణీ చేయాలి.. అనే విషయంపై రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.