కొందరు కాలక్షేపం కోసం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గృహిణులు తమకు దొరికిన ఖాళీ సమయంలో తమలోని టాలెంట్ ని బయట పెట్టడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. కొందరు యూట్యూబ్ లో కుకింగ్ వీడియోలు చేస్తోంటే.. మరికొందరు ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు భర్తలకు తమ భార్యలు చేస్తున్న ఈ పనులు నచ్చడం లేదు. దీనివల్ల తరచూ గొడవపడుతున్నారు. కొన్ని సార్లు ఈ గొడవలు హత్యలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి ఘటనే బిహార్ లో చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో వీడియోలు చేస్తోందని ఆగ్రహించిన ఓ భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన బిహార్ భోజ్‌పుర్‌లో రాత్రి చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నూ ఖాతూన్, అనిల్‌కు 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. సోషల్ మీడియాలో అన్నూ వీడియోలు(రీల్స్) చేస్తుండేది. భార్య అలా చేయడం భర్తకు నచ్చలేదు. వీడియోలు చేయొద్దని ఆమెను కోరాడు. ఇందుకు అన్నూ నిరాకరించింది.
దీంతో ఉద్రేకానికి గురైన అనిల్ భార్యను గొంతు నులిమి హత్యచేశాడు. సమాచారం అందుకున్న నవాడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.