13వ అంతస్తు నుంచి లిఫ్టు కూలిన ఘటనలో ఏడుగురు కూలీలు దుర్మరణం చెందిన ఘటన గుజరాత్ అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుజరాత్ యూనివర్సిటీకి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆస్పైర్-2 భవనంలో లిఫ్ట్ షాఫ్ట్ కూలడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది.
బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తొలుత కూలీలతో వెళ్తున్న లిఫ్ట్ కూలిందని భావించారు పోలీసులు. అనంతరం విచారించగా లిఫ్ట్ షాఫ్ట్ కూలిపోవడమే ప్రమాదానికి కారణమని తేలింది.
ఆరుగురు కూలీలు గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్టునకు మరమ్మతులు చేస్తుండగా 13వ అంతస్తులో ఉన్న లిఫ్టు షాఫ్ట్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఐదో అంతస్తులో ఉన్న ఇద్దరు కూలీలు అదుపుతప్పి లిఫ్టు గుంతలో పడిపోయారు. మొత్తం 8 మంది కూలీలపై లిఫ్టు షాఫ్ట్ పడగా ఏడుగురు మరణించారు. అని పోలీసులు తెలిపారు.
మృతులను పంచమహల్ జిల్లాలోని ఘోఘంబ ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనపై యజమానులెవరూ సమాచారం అందించలేదని మీడియా ద్వారా తెలిసిందని అధికారులు తెలిపారు.