డ్వాక్రా రుణాలను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్న ఉద్యోగి !

-

వినుకొండ బ్రాంచ్‌లో రూ.2 కోట్లు స్వాహా చేసారు. డ్వాక్రా రుణాలను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు ఓ ఉద్యోగి. దీంతో గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేపట్టారు అధికారులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అక్రమాలకు కేంద్రంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) నిలుస్తోంది. వడ్డీల రాయితీలు.. రుణాల కిస్తీలు.. లబ్ధిదారుల పేరిటే రుణాలు స్వాహా చేయడంలో బ్యాంకు ఉద్యోగులు చేతివాటం చూపుతున్నారు. తరచూ ఇలాంటి అక్రమాలు వెలుగుచూస్తోన్నా అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలేదు.

తూతూమంత్రపు చర్యలతో సరిపుచ్చుతుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇటీవల పొన్నూరులో రైతులకు ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ సొమ్మును తన ఖాతాలోకి జమ చేసుకున్న ఉద్యోగి ఉదంతం వెలుగుచూసింది. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా వినుకొండ బ్రాంచ్‌లో డ్వాక్రా రుణాలను తన ఖాతాలోకి వేసుకున్న సంఘటన వెలుగుచూసింది. రెండేళ్లుగా సాగిన ఈ వ్యవహారంలో ఓ ఉద్యోగి సుమారు రూ.2 కోట్ల వరకు తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు గుంటూరులోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయ అధికారుల దృష్టికి వచ్చింది.

బ్రాంచ్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కీలకబాధ్యతల్లో ఉన్నాడు. ఇతడు డ్వాక్రా గ్రూపుల పేరిట పోర్జరీ సంతకాలతో రుణాల దరఖాస్తులు చేసేవాడు. వాటికి రుణాలు మంజూరు కాగానే ఆ సొమ్ములను తన సొంత ఖాతాకు, మరికొన్ని కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేసుకుంటూ ఉండేవాడు. రన్నింగ్‌ రుణాల పేరుతో కొత్త రికార్డులను తనపరిధిలోనే ఉంచుకుని రెండేళ్ల పాటు ఈ కుంభకోణాన్ని కొనసాగించాడు. ఈ రుణాలకు సంబంధించి మూడు నెలలకొకసారి కొంత సొమ్ము నమోదు చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చేసేవాడు. ఇటీవల నాబార్డు ఆడిటర్ల హెచ్చరికతో బ్రాంచ్‌ నోడల్‌ అధికారులు డ్వాక్రా రుణాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.

ఈ క్రమంలో వినుకొండ బ్రాంచ్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి చేతివాటం వెలుగుచూసింది. దీంతో నాలుగు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా అధికారులు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో సమీక్షవినుకొండ బ్రాంచ్‌లో వెలుగుచూసిన కుంభకోణంపై బుధవారం గుంటూరు ప్రధాన కార్యాయంలో చైర్మన్‌ లాల్‌పురం రాము, పాలకవర్గ సభ్యులు నాయక్‌, కోట హరిబాబు, వెంకటేశ్వరరావులు సీఈవో కృష్ణవేణి, జీఎం భాను, డీజీఎంలు ఫణి, అజయకిషోర్‌తో సమీక్షించారు. ఇప్పటికే డ్వాక్రా రుణాల పంపిణీలో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులతో ఇద్దరు మేనేజర్లను బదిలీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news