అన్నంలో చీమలు ఎలా వచ్చాయ్‌ అని అడిగినందుకు భర్తను చంపేసిన భార్య..

భార్యభర్తలు మధ్య ఎందుకు గొడవలు వస్తాయో అస్సలు ఊహించలేం.. చిన్న చిన్న విషయాలకే ప్రపంచ యుద్ధాలు చేసినట్లు చేస్తారు.. వాళ్లకు అవి పెద్దగానే అనిపిస్తాయి..కానీ పక్కన ఉండి చూసేవాళ్లకు మాత్రం అరే దీని కూడా గొడవపడతారా అన్నట్లు ఉంటుంది. ఎవరో ఒకరు తగ్గితే..గొడవ అక్కడితో సర్దుమణిగింది..లేకపోతే..తుఫానే.. తాజాగా..ఒడిశాలో జరిగిన ఈ ఘటన చూస్తే అదే అనిపిస్తుంది. భార్య, భర్తల మధ్య ఏర్పడిన చిన్నపాటి తగదా.. తీవ్ర స్థాయికి చేరుకుని.. హత్యకు దారి తీసింది. అన్నంలో చీమలు ఎలా వచ్చాయని అడిగినందుకు భర్తను హత్యచేసింది భార్య.. మీరు విన్నది నిజమే.. భార్యే భర్తను హత్య చేసింది.
ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో భార్య, భర్తల మధ్య ఏర్పడిన చిన్న తగాదా హత్యకు దారి తీయడంతో ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నంలో చీమలు ఎలా పడ్డాయని భార్యను అడిగినందుకు భర్తను చంపేసిన ఘటన ఒడిశా రాష్ట్రం సుందర్‌గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. హేమంతా బాఘ్(35), సరిత(30) ఇద్దరు భార్యా, భర్తలు వీరికి ఇద్దరు కుమార్తెలు హేమలత, సౌమ్య ఉన్నారు. హేమంత్ ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తుండగా అన్నంలో చీమలు కనిపించడంతో భార్యను భర్త ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది కాస్తా చిలికి చిలికి గాలివానగా తయారైంది.. క్షణికావేశంలో భర్త గొంతు నులిమి భార్య చంపేసింది. హేమంత్ తండ్రి శశిభూషణ్ భాఘ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సరితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇండియాలో చాలా హత్యలు ..క్షణికావేశంలోనే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి..కోపంలో ఇద్దరు అరుచుకుంటారు.. అదే ఆవేశంలో.. పక్కన దొరికినదాంతో కొట్టడంతో..ప్రాణాలు పోతున్నాయి.. భార్యభర్తలు మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ఆ క్షణం సైలెంట్ అయిపోతే సమస్య ఉండదు. తగ్గితే ఎక్కడ ఇగో హర్ట్ అవుతుందో అని ఎవరు వెనకడువేయటం లేదు.. వీళ్ల కోపాలకు వాళ్ల పిల్లలకు బలైపోతున్నారు. ఇప్పుడు సరిత జైల్లో ఉంటుంది. తండ్రి చనిపోయాడు.. ఆ ఇద్దరి ఆడపిల్లల పరిస్థితి ఏంటి..?