జబర్దస్త్ ఫేమ్ ‘పొట్టి నరేష్‌’పై యువకుల దాడి

youth attacked jabardasth naresh team in srikakulam

ప్రతి గురువారం, శుక్రవారం ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్‌లో నటించే పొట్టి నరేష్‌పై కొంతమంది యువకులు దాడి చేశారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకున్నది. శ్రీకాకుళంలో జరుగుతున్న కళింగాంధ్ర ఉత్సవాల్లో ప్రదర్శన కోసం నరేష్‌తో పాటు ఆయన బృందం అక్కడికి వెళ్లింది. శనివారం రాత్రి వాళ్లు ప్రదర్శన ఇచ్చారు. అయితే.. ఈ సమయంలో కొందరు యువకులు గ్రీన్ రూమ్‌లోకి తొంగి చూసే ప్రయత్నం చేశారట. దీంతో వాళ్లను బౌన్సర్లు అడ్డుకున్నారట. అదే గొడవ ప్రధాన కారణమయింది. ప్రదర్శన అనంతరం నరేశ్ బృందం తిరుగు ప్రయాణం అయింది.

చిన్నబరాటం వీధి సమీపంలోకి వాళ్ల వాహనాలు రాగానే.. కొందరు యువకులు వాళ్ల వాహనాలపై దాడి చేశారు. రాళ్లు విసిరారు. దీంతో వాళ్ల వాహనాల అద్దాలు పగిలిపోయాయి. అనంతరం వాళ్లపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడి నుంచి పారిపోయారు. వాళ్లలో ఒక యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నరేశ్ టీమ్‌పై జరిగిన దాడి గురించి తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వాళ్లపై దాడి చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. అయితే.. ఈ దాడిలో నరేశ్ బృందానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు వెల్లడించారు.