నోట్ల రద్దు నుంచి డిజిటల్ పేమెంట్స్‌పై కాస్త ఫోకస్ పడింది. కరోనా, లాక్డౌన్ వల్ల ఇక డిజిటల్ పేమెంట్ అనేది మన నిత్య జీవితంలో భాగమైపోయింది. రూ.5 టీ తాగినా డిజిటల్ పేమెంటే చేసే స్థాయికి వచ్చారు ప్రజలు. ఈ క్రమంలోనే నెమ్మదిగా నగదు చెలామణీ తగ్గుతోంది. దీపావళి వారంలో నగదు చెలామణీ రూ.7,600 కోట్ల మేర తగ్గింది. గత రెండు దశాబ్దాల్లో నగదు చెలామణీ తగ్గడం ఇదే మొదటిసారని ఎస్‌బీఐ నివేదికలో పేర్కొంది. దేశంలో ప్రజలు డిజిటల్ చెల్లింపులుపై ఆధారపడడం పెరగడమే ఇందుకు కారణమని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నెలకొన్న మాంద్యమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లలో భారత నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ.. స్మార్ట్‌ఫోన్ ఆధారిత చెల్లింపులకు మారిందని వివరించారు. నగదు చెలామణీ తగ్గడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు నిల్వల నిష్పత్తి కూడా తగ్గుతుందని, ఫలితంగా డిపాజిట్‌ల క్షీణత ఆగి, నగదు లభ్యతపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. యూపీఐ, వాలెట్లు, పీపీఐలు నగదు బదిలీ ప్రక్రియను సులభతరం చేశాయని, బ్యాంక్ ఖాతాలు లేనివారు కూడా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు వెల్లడించారు.