తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కాగ సోమవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మండలిలో శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాగ అసెంబ్లీలో హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెడుతుండగా.. బీజీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారని.. వారిని స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో నేడు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. కాగ ఈ ఆందోళనలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.
దళిత బంధు పథకం ఒక బోగస్ అని తీవ్రంగా విమర్శించారు. దళిత బంధు పథకం అర్హులకు కాకుండా.. టీఆర్ఎస్ నాయకులకు ఇస్తున్నారని ఆరోపించారు. అలాగే 90 శాతం దళిత బంధును లబ్ధిదారు కుటుంబం పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదని అన్నారు. ఒక్క కుటుంబంలో రూ. 10 లక్షలను వాడుకోవడం లేదని అన్నారు. కేవలం రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారని ఆరోపించారు.
అలాగే నీతి ఆయోగ్ నుంచి నిధులు రాలేవని ప్రకటించి.. ఇప్పుడు బడ్జెట్ లో చూపెట్టారని విమర్శించారు. అలాగే గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. దాదాపు 40 రోజుల కు పైగా సాగేవని అన్నారు. కానీ నేడు ఐదు రోజులకు మించి జరపడం లేదని మండిపడ్డారు.