రాష్ట్ర ప్రభుత్వ ప్లాగ్ షిప్ పథకం దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్ నజర్ పెట్టారు. ఈనెల 18న దళితబంధు పథకంపై సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల కలెక్టర్లు, మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పథకం అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.
హుజూరాబాద్ ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అట్టహాసంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని చాలా ప్రెస్టేజియస్ పథకంగా భావిస్తున్నారు. మొట్టమొదటగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ కార్యక్రమం కింద ప్రారంభించారు. అయితే దశలవారీగా అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని గతంలో సీఎం కేసీఆర్ తెలిపారు. దళితబంధును ఇతర వర్గాల వారికి కూడా విస్తరింప చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కూడా పథకం అమలులో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే తాజాగా సీఎం సమావేశం ఉండనుంది.