తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చిన దళితబంధు వ్యూహం రివర్స్ అయ్యేలా ఉంది. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడంలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న దళితుల ఓటర్లని తమవైపుకు తిప్పుకోవడం కోసం కేసీఆర్, దళితబంధు స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు.
అయితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తుండటంతో, రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ పెరిగింది. అలాగే ఇతర కులాలు వారు కూడా తమ కూడా పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సరే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్తితి ఎలా ఉన్నా, ఈ పథకం వల్ల హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు బెనిఫిట్ అవుతుందని అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఇది రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.
హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 21 వేల దళిత కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. కానీ మొదటగా నియోజకవర్గ వ్యాప్తంగా 5000 వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. దీంతో నియోజకవర్గంలో అన్నీ కుటుంబాలకు పథకం ఇవ్వాలని డిమాండ్ పెరిగింది. పైగా మొదట విడతలో అర్హులు కానివారికి కూడా పథకం ఇస్తున్నారని దళిత వర్గాలు ఆందోళనలకు దిగాయి.
అటు బీసీ కులాలు కూడా తమకు పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ దళితబంధు పథకం కొందరికి ఇవ్వడం, బీసీలకు ఇలాంటి భారీ పథకం లేకపోవడం టీఆర్ఎస్‌కే ఇబ్బంది అయ్యేలా కనిపిస్తోంది. ఈ పథకం తక్కువ మందికి వెళితే, ఎక్కువ మంది నుంచి వ్యతిరేకిత రావడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఈ దళితబందు పథకమే టీఆర్ఎస్‌కు భారీ డ్యామేజ్ చేసేలా ఉంది.