దళిత ఓటర్లని ఆకట్టుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్, దళితబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనికి కౌంటర్‌గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…ఇంద్రవెల్లి వేదికగా దళిత, గిరిజనులతో భారీ సభ నిర్వహించారు. ఈ సభ వేదికగా కేసీఆర్‌పై రేవంత్ నిప్పులు చెరిగారు. ఇక రేవంత్ విమర్శలకు కౌంటర్‌గా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు లైన్‌లోకి వచ్చేశారు. వారు కూడా రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
ఇదే క్రమంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని, కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ పీసీసీ పదవి కూడా పోతుందని టీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నికకు, రేవంత్ పీసీసీ పదవికి పెద్దగా లింక్ లేదనే చెప్పొచ్చు. అసలు హుజూరాబాద్ ఉపఎన్నికని రేవంత్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన 2023 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.
అలాంటప్పుడు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓడిపోతే అధిష్టానం…రేవంత్‌ని పీసీసీ పదవి నుంచి తొలగించడం జరిగే పని కాదు. అలాంటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ఉండగా…2014, 2018, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, పలు ఉపఎన్నికల్లో ఓటమి పాలైంది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ సిట్టింగ్ సీటు హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఓడిపోయింది. అయినా సరే ఉత్తమ్, పీసీసీ పదవి పోలేదు. అలాంటప్పుడు కాంగ్రెస్‌కు ఏ మాత్రం బలం లేని హుజూరాబాద్‌లో ఓడిపోతే, రేవంత్ పీసీసీ పదవి పోవడం జరిగే పని కాదు.
ఏదో టీఆర్ఎస్ నేతలు రాజకీయంగా విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది తప్ప...హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓడిపోవడానికి, రేవంత్ పీసీసీ పదవికి ఎలాంటి లింక్ లేదనే చెప్పొచ్చు. అయిన రేవంత్ ఒక్క సభతో టీఆర్ఎస్ ఫోకస్ మొత్తం తనవైపే తిప్పుకునేలా చేశారని చెప్పొచ్చు.