ఏపీ డీజీపీకి చంద్రబాబు మరో లేఖ రాశారు. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం, తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి మరియ దాస్ అలియాస్ చిన్నాలు అధికార వైసీపీకి చెందిన వారి నుంచి గూండాలు నుంచి తీవ్ర ప్రాణహాని ఎదుర్కొంటున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. పులి మరియా దాస్ టీడీపీలో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని… మరియ దాస్ రాజకీయాలలో చురుకుగా ఉండటంతో వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఆయనపై పగ పెంచుకున్నారని వివరించారు.
ఎంపీ సురేష్ తన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో మరియ దాస్‌ను టార్గెట్ చేశారని… ఎంపీ నందిగం సురేష్ ఆదేశాలతో మరియ దాస్ పై దాదాపు 30 కేసులు పెట్టారన్నారు. ఈ వేధింపులకు పరాకాష్టగా, 18 సెప్టెంబర్ 2021న, ఉద్దండరాయునిపాలెం గ్రామం మధ్యలో మరియ దాస్‌పై సురేష్ అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని లేఖలో చంద్రబాబు వెల్లడించారు.
సురేష్ అనుచరులు మరియ దాస్ ను చంపాలనే ఉద్దేశ్యంతో ప్రతిరోజూ అతని కదలికలను అనుసరిస్తూ ఆయన ఇంటిపై రాత్రి సమయంలో నిఘా ఉంచారని.. వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు మరియ దాస్ కుటుంబ సభ్యులను, బంధువులను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మరియ దాస్‌కు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం, ఎంపీ నందిగాం సురేష్ బాధ్యత వహించాలన్నారు. పులి మరియ దాస్‌పై జరిగిన వేధింపులు, దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని… మరియా దాస్‌కు ఎలాంటి హాని జరగకుండా చూసేందుకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.