తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని, ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్ ఎందుకు అన్నట్లుగా రేవంత్ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్ గారు..తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు.
మూడు గంటల్లో మూడు ఎకరాలకు నీళ్లు ఎలా పారతాయని నిలదీశారు. అతి తెలివి మాటలు కట్టిపెట్టి… మూడు గంటలో మూడు ఎకరాలు ఎలా పారతాయో చేసి చూపించాలని సవాల్ విసిరారు. రేవంత్ ఇంట్లో 24 గంటలూ కరెంట్ ఉండాలి కానీ, రైతులకు 24 గంటల కరెంట్ అక్కర్లేదా? అని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అహంకారం తలకెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులను పీడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు.