ఆ నదిలో చిన్నారుల శవాలు ఏరులై పారుతున్నాయి.. విగతజీవులుగా పడి ఉన్న దృశ్యం అందరిని ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలోని వాన్ నదిలో శిశువుల మృతదేహాలు కనిపించడం పెను సంచలనం రేపింది. చనిపోయిన చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు నదిలో వదిలేశారు. బుల్దానా జిల్లా సంగ్రామ్‌పూర్ తాలూకా కొలాడ్ గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని వాన్ నదిలో చిన్నారుల శవాలు కలకలం రేపుతున్నాయి.. సమాచారం అందుకున్న తమ్‌గావ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టగా వారికి సంచలన విషయాలు తెలిశాయి. పెద్ద ఎత్తున అక్రమ అబార్షన్ రాకెట్ మొదలైనట్లు వాళ్లు నిర్ధారించారు. ఈ విషయం తెలియగానే నది వద్దకు గ్రామస్థులు భారీగా చేరుకున్నారు. గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో బోగార్ వైద్యులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని స్థానిక ప్రజలు తరచూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు..ఇలాంటి వైద్యులు ఎక్కువగా అక్రమ అబార్షన్ రాకెట్‌ను నడుపుతున్నారని, అలా చేసి చనిపోయిన శిశువుల అవశేషాలను నదిలో పడేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయమై తమ్‌గావ్ పోలీసులు విచారణ చేపట్టారు.. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అక్రమ అబార్షన్ రాకెట్ చురుగ్గా సాగుతున్నట్లు పోలీసులు అంగీకరించినా.. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయక పోవడం గమనార్హం.
బుల్దానాలోని సంగ్రామ్‌పూర్ తాలూకా కోలాడ్ గ్రామంలోని వాన్ నదిలో కుప్పలుతెప్పలుగా మృతదేహాలు కనిపించాయి. వీటి వయసు నాలుగు నుంచి ఆరు నెలల వరకు ఉండవచ్చు. ఈ ఘటనతో గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. గ్రామస్థులు సమీపంలోని తమ్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 318 కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరగా అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. దీంతో తమ్‌గావ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి… ఈ ప్రాంతంలో అబార్షన్ రాకెట్ చట్టవిరుద్ధంగా పనిచేస్తోందని ప్రాథమిక విచారణలో గుర్తించారు. త్వరలో వాటిని కఠినతరం చేస్తామని గ్రామస్థులకు నచ్చ జెప్పారు.