టర్కీ, సిరియాలో భూకంప మృతులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇప్పటి వరకు రెండు దేశాల్లో కలిపి 15వేలకు పైగా దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య 20వేలకు చేరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల్లో ఇప్పటి వరకు లక్షల మంది క్షతగాత్రులయ్యారు.
సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు హృదయాలను మెలిపెడుతున్నాయి. పలువురు రాళ్లు, రప్పల మధ్య చిక్కుకుని ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సహాయ శిబిరాలను సందర్శించారు. ఈ ఘోర విపత్తుతో అల్లాడుతున్న ప్రాంతాలకు మరింత సాయం అందించాలంటూ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అధికారులను ఆదేశించారు.