రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బైక్ లిఫ్టు మర్డర్ మిస్టరీని ఖమ్మం పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ముందు నుంచి అనుమానిస్తున్నట్టు ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. హత్యకు కుట్ర పన్నిన మృతుడు జమాల్ భార్య ఇనామ్బీతో పాటు సహకరించిన, హత్య చేసిన నిందితులు మోహన్ రావు, వెంకటేశ్, వెంకట్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
మోహన్‌రావు, వెంకటేశ్, వెంకట్లు చింతకాని మండలం నామవారం వాసులుగా గుర్తించిన పోలీసులు.. రెండు నెలల నుంచే జమాల్‌సాహెబ్ హత్యకు నిందితులు కుట్రపన్నుతున్నట్లు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని జమాల్‌సాహెబ్ హత్యకు పథకం రచించారని.. భర్తను చంపేందుకు భార్య ఇమామ్‌బీ ఇంట్లోనే ఇంజక్షన్ దాచిపెట్టిందని వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ముదిగొండ మండలం వల్లభి సమీపంలో సోమవారం ఇంజక్షన్ దాడిలో మృతి చెందాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఖమ్మం పోలీసులు కేవలం 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించారు.