షార్జాలో శుక్రవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 23వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో రాజస్థాన్ తడబడింది. ఆ జట్టు ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. కీలకమైన మ్యాచ్‌లో కూడా ఆ జట్టు బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యంగా ఆడారు. దీంతో రాజస్థాన్‌పై ఢిల్లీ 46 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ఢిల్లీ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో షిమ్రాన్ హిట్‌మైర్, స్టాయినిస్‌లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. 24 బంతుల్లోనే 1 ఫోర్, 5 సిక్సర్లతో హిట్‌మైర్ 45 పరుగులు చేయగా, స్టాయినిస్ 30 బంతుల్లో 4 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 17 పరగులు చేసి జట్టుకు మరిన్ని పరుగులు జోడించాడు. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు రాజస్థాన్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా, కార్తిక్ త్యాగి, ఆండ్రూ టై, తెవాతియాలు తలా 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ ఏ దశలోనూ కోలుకోలేదు. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో 138 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో తెవాతియా, జైశ్వాల్, స్మిత్ మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో తెవాతియా 38 పరుగులు చేయగా, జైశ్వాల్ 36 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అదేవిధంగా రాజస్థాన్ కెప్టెన్ స్మిత్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో మళ్లీ రబాడా విజృంభించాడు. 3.4 ఓవర్లు వేసిన రబాడా 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్, స్టాయినిస్‌లు చెరో వికెట్లు పడగొట్టారు. నోర్జె, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్‌లకు తలా 1 వికెట్ దక్కింది.