లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు నాయకులే కాదు : డిప్యూటీ సీఎం

శ్రీకాకుళం: ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు నాయకులే కాదని… అదృష్టం కొద్దీ సినిమాల్లో పవన్ కళ్యాణ్ పెద్ద ఫైటర్ అయ్యాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ జగన్ ను విమర్శించేటంతటి వాడైపోయాడని చురకలు అంటించారు. ఇప్పటికైనా విజ్ఙతతో మెలగకపోతే టీడీపీకి 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు కూడా మిగలవన్నారు.

ఉత్తరాంధ్రను తామే అభివృద్ధి చేశామని అచ్చెన్నాయుడు చెబుతున్నారని… రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉండి విషయాలు సరిగా తెలుసుకోకుండా మాట్లాడటం దురదృష్టకరమని ఫైర్‌ అయ్యారు.
అచ్చెన్నాయుడి దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని… గతంలో అచ్చెన్నాయుడి సోదరుడు ఎర్రన్నాయుడు ఏనాడూ ఇలా మాట్లాడలేదని తెలిపారు. వైఎస్సార్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని… గోతులు తవ్వి , కొబ్బరికాయలు కొట్టడం టీడీపీ నేతలకు అలవాటైపోయిందని ఫైర్‌ అయ్యారు.  ఎవడో కట్టిన ఇంటికి సున్నం వేసి మేమే కట్టేశామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటని.. తప్పుడు ప్రవర్తన, తప్పుడు మాటలు ఇక పై కట్టిపెట్టాలని హెచ్చరించారు. మీరు కుప్పిగంతులు వేస్తుంటే ఇక పై చూస్తూ ఊరుకోమని… ధీటుగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.