‘మహా’ రాజకీయం.. ఫడ్నవీస్‌కు హోం, ఆర్థిక శాఖలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసి 40 రోజులకు పైనే అవుతుండగా, ఇన్నాళ్లకు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు రవాణా, పర్యావరణ, విపత్తు నిర్వహణ, సమాచార ప్రజా సంబంధాలు, సహాయక చర్యలు-పునరావాసం తదితర శాఖలను ను షిండే తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు కీలక శాఖలైన హోం, ఆర్థిక శాఖలు అప్పగించారు. ఫడ్నవీస్ ఇవేకాకుండా న్యాయశాఖ, గృహనిర్మాణ శాఖ, విద్యుత్ శాఖ బాధ్యతలను కూడా పర్యవేక్షించనున్నారు. తాజా పరిణామాలపై ఫడ్నవీస్ స్పందిస్తూ, మంత్రి పదవుల పంపకాల్లో బీజేపీకి, ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

Devendra Fadnavis Scores Big In Eknath Shinde Cabinet Allocation

ఒకవేళ అవసరమైతే తదుపరి మంత్రివర్గ విస్తరణకు ముందే కొన్ని మంత్రి పదవులను ఇచ్చిపుచ్చుకుంటామని తెలిపారు ఫడ్నవీస్. బీజేపీ నేతల్లో రాధాకృష్ణ విఖే పాటిల్ కు రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, డెయిరీ వ్యవహారాల శాఖ కేటాయించారు. సుధీర్ ముంగటివార్ కు అటవీశాఖ, సాంస్కృతిక వ్యవహారాలు, మత్స్యశాఖ…. చంద్రకాంత్ పాటిల్ కు ఉన్నత, సాంకేతిక విద్య, టెక్స్ టైల్ ఇండస్ట్రీ, పార్లమెంటరీ కార్యకలాపాల శాఖ అప్పగించారు. ఇక, సీఎం షిండే వర్గంలోని దీపక్ కేసర్కార్ కు పాఠశాల విద్యాశాఖ, అబ్దుల్ సత్తార్ కు వ్యవసాయ శాఖ, శంభురాజ్ దేశాయ్ కి ఎక్సైజ్ శాఖ కేటాయించారు.