మాజీ మంత్రి హడావిడి పై కృష్ణాజిల్లాలో కొత్త చర్చ

-

మంత్రి కొడాలి నాని.. మాజీ మంత్రి దేవినేని ఉమకు మధ్య జరిగిన సవాళ్ల పర్వం.. గొల్లపూడి రోడ్ల మీద అధికార-ప్రతిపక్ష పార్టీల వీరంగం.. పోలీసుల హడావిడి.. ఈ సందర్భంగా జరిగిన నాటకీయ పరిణామాలతో రాజకీయం వేడెక్కింది. పార్టీల నేతలు ఈ ఎపిసోడ్‌పై ఎవరి వాదనలు వారు వినిపించుకుంటున్నారు. కానీ.. రాజకీయ వర్గాల్లో మరో అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోందట.

నెత్తిన టోపీ ముఖాన్ని మొత్తంగా కప్పేసే మాస్క్‌.. తలొంచుకుని ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గరకు నడుచుకుంటూ వచ్చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ. చివరిక్షణంలో గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.భద్రత ఉన్నా.. ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గరకు ఉమ ఎలా చేరుకున్నారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. సోమవారం రాత్రంతా దేవినేని ఉమ ఎక్కడున్నారు? గొల్లపూడిలోని తన ఇంటిలో ఉన్నారా? లేక గొల్లపూడిలోనే ఎవరైనా బంధువుల ఇంట్లో ఉన్నారా? ఎన్టీఆర్‌ విగ్రహానికి సమీపంలోని ఎవరైనా కార్యకర్త ఇంట్లో నిద్ర చేశారా? అదీ ఇదీ కాకుండా.. ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గరున్న పార్టీ ఆఫీసులో ఉన్నారా? అన్నది పెద్ద డిబేట్‌ పాయింట్‌గా మారింది.

ఉమ చెప్పిన ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద.. గొల్లపూడి జంక్షన్‌లో పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఉమను ఇంటి నుంచి బయటకు రాకుండా కాపు కాశారు. అయినా ఇంత మంది కళ్లు కప్పి ఆయన అక్కడికి ఎలా చేరుకోగలిగారు అన్నదే చర్చగా మారింది. సోమవారం రాత్రంతా దేవినేని ఉమ తన ఇంటిలో ఉన్నారట. అయినా పోలీసుల కళ్లుకప్పి తప్పించుకున్నారట.

మంగళవారం ఉదయం మాజీ మంత్రి ఇంటి నుంచి ఓ కారు ఖాళీగా బయటకు వెళ్లింది. అక్కడ ఉన్నవారు.. ఆ కారేంటీ ఎక్కడకు వెళ్తోందని ఆరా తీస్తే పూజ చేయించుకోవడానికి వెళ్తోందని చెప్పారట. కానీ అదే కారులో దేవినేని ఉమ ఉన్నారట. ఉమ కారులో ఉంటే కన్పించాలి కదా అంటే.. ఆయన సీట్లో కాకుండా.. కారు డిక్కీలో పడుకుని వెళ్లారట. అలా డిక్కీలో పడుకుని అనుకున్న ప్లేస్‌కు చేరుకున్నారని చెబుతున్నారు.

ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. దేవినేని ఉమను పదే పదే టార్గెట్‌ చేస్తున్నారు మంత్రి కొడాలి నాని. ఇలాంటి సమయంలో సవాల్‌ చేసి ఇంట్లోనే ఉండిపోయినా.. ఇంట్లో నుంచి బయటకొచ్చే సమయంలో పోలీసులు అడ్డుకున్నా బాగోదని అనుకున్నారట ఉమ. అందుకే కారు డిక్కీని ఎంచుకుని విగ్రహాన్ని టచ్‌ చేశారట. గొల్లపూడి గొడవ కంటే ఈ డిక్కీ రాజకీయంపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నారట రాజకీయవర్గాలు.

Read more RELATED
Recommended to you

Latest news