సాధారణ వ్యక్తుల కన్నా పోలీసులకే రెట్టింపు శిక్ష

-

  • డీజీపీ ఠాకూర్‌ హెచ్చరిక
  • బెజవాడలో ఓ యువతిని వేధించిన పోలీసులపై కేసు
  • వివాహేతర’ వ్యవహారంలో డీఎస్పీపై సస్పెన్షన్‌ వేటు

DGP RP Thakur Fire On Police

అమరావతి : ‘ఆడవాళ్లతో ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా ఉపేక్షించొద్దు. మీరు కఠినంగా వ్యవహరించకుంటే మీపై నేను చర్యలు తీసుకుంటా’ అని పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో రెండు రోజుల్లో జరిగిన రెండు వరుస ఘటనల్లో పోలీసులపై ఆరోపణలు రావడం పట్ల పోలీస్‌ బాస్‌ తీవ్రంగా స్పందించారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే వారిని వేధిస్తే కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే… విజయవాడకు చెందిన ఒక యువతి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది.

ఇటీవల విజయవాడ బస్టాండ్‌లో బస్‌ కోసం వేచియున్న ఆమెను ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అసలు గుట్టు బయటపడింది. ఆమెపై వేధింపులకు పాల్పడిన ఇద్దరూ పోలీసు కానిస్టేబుళ్లేనని తేలింది. ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ పోలీసు విభాగంలో పనిచేస్తున్న వెంకటేశ్‌, మాధవరావు గా వీరిని గుర్తించారు. వెంకటేశ్‌ది నెల్లూరు జిల్లా వెంకటగిరి అని, మాధవరావు స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి అని తేలింది. వారిని సస్పెండ్‌ చేయాలని, అరెస్టు చేసి విచారించాలని డీజీపీ ఆదేశించినట్లు తెలిసింది.

ఉద్యోగం ఇప్పిస్తానని…
వెంకటగిరి బెటాలియన్‌ కమాండెంట్‌గా(డీఎస్పీ హోదా) పనిచేస్తున్న ఆ అధికారి, తన పొరుగింటి మహిళపై కన్నేశారు. ఆమెకు తిరుపతిలో ఉద్యోగం ఆశ చూపి శారీరకంగా లొంగదీసుకున్నట్లు ఆమె భర్త ఫిర్యాదు చేశారు. దీనిపై తిరుచానూరు పోలీసులు రంగంలోకి దిగారు. బంధువులతో కలిసి తన ఇంట్లో తన భార్యతో ఉన్న డీఎస్పీని పట్టించేందుకు ఫిర్యాదుదారు.పోలీసుల్ని వెంట పెట్టుకొని వెళ్లాడు. అయితే, అప్పటికే డీఎస్పీ అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తీవ్రంగా స్పందించారు.

మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిని వేధించడం, లొంగదీసుకోవడం ఏమిటని మండిపడ్డారు. డీఎస్పీ వ్యవహారశైలిపై నివేదిక ఇవ్వాలని తిరుపతి ఎస్పీ కేఏఎన్‌ అన్బురాజన్‌ను ఆదేశించారు. ఆయన పంపిన నివేదిక ఆధారంగా డీఎస్పీని సస్పెండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news