డైలాగ్ ఆఫ్ ద డే : శ్రీ రామ నామాలు శ‌త కోటి

-

రామ‌య్య తండ్రి ఇవాళ మ‌న‌కు ఓ గొప్ప స్మ‌ర‌ణ కావొచ్చు.. అయినా ఆయ‌న‌ను మించిన తండ్రి ఉన్నాడా..ఆయ‌న‌ను మించిన కొడుకు ఉన్నాడా.. ప‌దవుల కోసం వ్యామోహం ఉందా ? ఏమీ వ‌ద్దు అనుకున్న వేళ అడ‌వి మార్గం ప‌ట్టాడు. భార్య జాడ తెలిశాక యుద్ధ భూమికి చేరాడు. బ్రాహ్మ‌ణ హ‌త్య మ‌హాపాత‌కం అని కుమిలి పోయాడు. రావ‌ణ బ్ర‌హ్మ సంహారం త‌రువాత ప‌రిహారం చేసుకున్నాడు. అంత గొప్ప‌వాడు రాముడు. శ‌త్రువును సైతం కీర్తించే గొప్ప‌వాడు రాముడు. ఇవాళ మ‌న నాయ‌కుల్లో ఎంద‌రు ఆ కోవ‌లో ఉన్నారు.

చ‌ల్లని దీవెన‌లు ఇచ్చే తండ్రి రాముడు. శౌర్య పరాక్ర‌మాల‌కు మారు పేరు రాముడు. క‌ష్టాల‌కు కుంగుబాటు వ‌ద్ద‌ని చెప్పే ధీరుడు రాముడు. ప్ర‌జ‌ల‌ను ప్రేమించ‌డం.. రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచ‌డం ఒక్క ఆ రామ‌య్య తండ్రికే సాధ్యం. అంత‌టి స్థాయి నేటి పాల‌కులకు ఉండాలి. ఉందా అంటే సందేహ‌మే ! ముఖ్యంగా పాల‌న‌లో జ‌న‌రంజ‌క‌త్వం… అన్ని వ‌ర్గాల‌నూ ఆక‌ట్టుకోవ‌డం, ఎవ‌రికి ఏ ఆప‌ద వచ్చినా స్పందించి నివారించ‌డం ఇది రామ‌య్య తండ్రి పాల‌న‌లో ముఖ్య సూత్రం.రెండు ఒదిగి ఉండ‌డం.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండ‌డం. త‌ల్లిదండ్రుల విష‌య‌మై విన‌యంగా ఉండ‌డం.పౌరులను ప్రేమించడం, గౌర‌వించ‌డం ఇవి కూడా మ‌న పాల‌కులు నేర్చుకోవాలి.

ముఖ్యంగా పాల‌కులు బంధు ప్రీతికి తావివ్వ‌కూడ‌దు. అవినీతికి తావివ్వ‌కూడ‌దు. పితృవాక్య ప‌రిపాల‌న అన్న‌ది ఆయ‌న ధ్యేయం అంతేకానీ ఆయ‌న వార‌స‌త్వ రాజ‌కీయాల కోసం తాప‌త్ర‌య ప‌డ‌లేదు. అవ‌స‌రం అయితే రాజ్యం విడిచిపోవ‌డానికి కూడా సిద్ధం అయిన గొప్ప రాజు రాముడు. అంటే అవ‌స‌రం అనుకుంటే ప‌ద‌వులు త్య‌జించాలి. అవ‌స‌రం అనుకుంటే రాజ్యాన్ని వ‌ద్ద‌నుకోవాలి.
ఇవ‌న్నీ ఇప్ప‌టి పాల‌కుల్లో ఉన్నాయా?

క‌ష్ట‌కాలంలో చిన్న చిన్న సాయాల‌ను సైతం గుర్తు పెట్టుకోవాలి. వార‌ధి నిర్మాణానికి ఆ రోజు ఎంత మంది సాయం చేశారో. అలాంటి వానర సేన కృషిని రాముడు మ‌రువ‌లేదు. సీత‌మ్మ జాడ తెచ్చిన ఆంజ‌నేయుడ్ని జీవిత కాలం ఆప్త స్నేహితుడిగానే గుర్తించి గౌర‌వించాడు. ప‌ద‌వులు వ‌ద్దు అన్న ఆ గొప్ప భ‌క్తుడు క‌న్నా గొప్ప‌వారు ఇవాళ ఎవ‌రున్నారు.

ఈ సంద‌ర్భంగా యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ఏమ‌న్నారంటే.. “ఎల్లవేళలా ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తూ.. ప్రజల కష్ట సుఖాల్లో అండగా ఉంటూ, వారి ఆనందమే తన ఆనందమని భావించి రామ రాజ్యాన్ని అందించిన గొప్ప పాలకుడు శ్రీరామ చంద్రుడు. ఆ జగదభిరాముడి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. ” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news