కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. నిత్యం 15వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య మొదట్నుంచీ పెరుగుతూనే ఉంది. కానీ తెలంగాణలో మాత్రం ఓ దశలో కరోనా నియంత్రణలోకి వచ్చినట్లే కనిపించింది. సీఎం కేసీఆర్ కరోనా నుంచి మనం బయట పడినట్లే అని చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కేసుల సంఖ్య నిత్యం భారీగా నమోదవుతుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అయితే కరోనా విషయంలో తెరాస ప్రభుత్వం లైట్ తీస్కుందని, అందుకనే ఇప్పుడు భారీగా కేసులు నమోదవుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.
నిజానికి కరోనా లాక్‌డౌన్ మొదట్లో తెరాస ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఎక్కడ లేని విధంగా కరోనా కాంటాక్ట్ కేసులను చాలా పకడ్బందీగా ట్రేస్ చేశారు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేశారు. కరోనా కేసుల తగ్గుదలపై దృష్టి పెట్టారు. ఓ వైపు తబ్లిగి జమాత్ వల్ల కేసులు పెరిగినా మళ్లీ రాష్ట్రంలో కరోనాను అదుపు చేశారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఆంక్షల సడలింపు ఎప్పుడైతే ప్రారంభమైందో.. అప్పటి నుంచి తెరాస ప్రభుత్వం కరోనాను లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఐసీఎంఆర్ చెప్పిందంటూ నిత్యం చేసే కరోనా టెస్టుల సంఖ్యను తగ్గించేశారు. దీంతో మొదటికే మోసం వచ్చింది.
ఇక సాక్షాత్తూ పలువురు ప్రజా ప్రతినిధులే కరోనా బారిన పడడం.. మరోవైపు హైకోర్టు పదే పదే మొట్టికాయలు వేయడంతో తెరాస ప్రభుత్వం ఎట్టకేలకు కరోనా టెస్టులను పెంచింది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వాన్ని నిందించేందుకు ఓ అంశం దొరికింది. ఇందుకు అధికార పార్టీయే చనువు ఇచ్చినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి కరోనా విపత్కర స్థితి నుంచి రాష్ట్రం బయట పడుతుందా ? ఎంత సమయం పడుతుంది ? అన్న వివరాలు వేచి చూస్తే తెలుస్తుంది.