అర్రే పొరపాటున వేరే ఖాతాకు డబ్బు పంపేశారా..అయితే ఏం చేయాలంటే..!

-

ఒకప్పుడు బ్యాంకులో డబ్బు వెయ్యాలన్నా తియ్యాలన్న పెద్ద తతంగం. బ్యాంకుకు వెళ్లి లైన్లో నుల్చుని వాళ్లు ఇచ్చే ఓ కాయిన్ పట్టుకుని మన కాయిన్ నంబర్ వచ్చే వరకు వెయిట్ చేసి చేసి.. ఈరోజు అయ్యేలాలేదు..రేపు వద్దాం అనుకుని వెనుతిరిగే టైంలో అప్పుడు కాల్ వస్తుంది. హమ్మయ్యా బతికించార్రాబాబు అనుకుని వెళ్లి డబ్బులు వేయటమే, తిసుకోవటమే చేస్తుంటాం. కానీ ఇప్పుడు అలాకాదు. క్షణాల్లో ఎవరికైనా డబ్బులువేయొచ్చు. ఆన్ లైన్ బ్యాంకింగ్ వచ్చాక మనపని చాలాసులువైంది. పానీపూరివాలా నుంచి పెద్దపెద్దషాపింగ్ మాల్స్ వరకూ అందరి దగ్గర క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు ఫటాఫట్ మని పంపేయొచ్చు. అయితే కొన్నిసార్లు మనం పొరపాటున వేరేవాళ్లకు మనీ పంపిస్తుంటాం. ఫోన్ నంబర్లో ఒక్క నంబర్ తప్పుకొట్టినా అంతే వేరేవాళ్లఖాతాలో మనీపడతాయ్. ఇలా మన జీవితంలోనే, మన ఫ్రెండ్స్ కో జరిగే ఉంటుంది. చిన్నమొత్తంలో మనీ అయితే మనం అంతగా పట్టించుకోం. కానీ పెద్దమొత్తంలో మనీ వేస్తే ఏంటి పరిస్థితి..ఇప్పుడు చూద్దాం.
ఇలా పొరపాటున మీకు తెలియని వ్యక్తులకు నగదు పంపేసినపుడు.. వెంటనే మీ బ్యాంకు కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి జరిగినదంతా తెలియచెప్పండి. వారు అడిగిన జి-మెయిల్ ఐడికి మీ ట్రాన్సాక్షన్ తాలూకు వివరాలను పంపించాల్సి ఉంటుంది. అయితే.. మీ ఖాతా పేరు, నెంబర్ వివరాలతో పాటు మీ ఏ ఖాతా నెంబర్ కి డబ్బు పంపించారో ఆ వివరాలు కూడా తెలియపరచాలి. ఒకవేళ మీరు ఏదైనా తప్పు నెంబర్ ఉన్న ఖాతాకి గాని, తప్పు IFSC కోడ్ ఉన్న ఖాతాకి గాని డబ్బు పంపించి ఉంటే.. ఆ డబ్బు వెంటనే మీ ఖాతాలో జమ అయిపోతుంది
ఒకవేళ మీ బ్యాంకుకే చెందిన మరొకరి ఖాతాకి డబ్బుని బదిలీ చేసి ఉంటే.. బ్యాంకుని సంప్రదించిన తరువాత కొద్దిసేపటికే.. మీ డబ్బు మీ ఖాతాలోకి చేరుతుందట. ఒకవేళ వేరే బ్యాంకుకు చెందిన ఖాతాకు డబ్బు జమ అయి ఉంటే.. తిరిగి మీ డబ్బు మీ ఖాతాలోకి రావడానికి సమయం పట్టచ్చు. ఎందుకంటే మీ బ్యాంకు.. ఇతర బ్యాంకుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలల వరకు అయినా సమయం పట్టే అవకాశం ఉంటుంది.
మీరు ఏ ఖాతాకి అయితే డబ్బు పంపారో సదరు వ్యక్తిని బ్యాంకు సంప్రదిస్తుంది. ఆ డబ్బుని తిరిగి పంపాలని చెప్తుంది. ఒకవేళ ఈ విషయంలో బ్యాంకులు పట్టించుకోకపోయినా.. మీ డబ్బు తిరిగి మీ ఖాతాలోకి రాకపోయినా.. మీరు ఈ విషయమై కోర్ట్ ను ఆశ్రయించవచ్చు. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించాలని ఆర్బీఐ ఇప్పటికే అన్ని బ్యాంకులను ఆదేశించింది.
ఒకవేళ ఎవరైనా డబ్బుని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే.. వారి ప్రవర్తనను రిజర్వ్ బ్యాంకు చట్టాల ఉల్లంఘన కింద పేర్కొంటారు. తప్పు ఖాతాకు డబ్బు జమ అయితే ఈ డబ్బుని సరి అయిన ఖాతాకు పంపించాల్సిన బాధ్యత బ్యాంకుదేనని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news