రాష్ట్ర రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని.. రాష్ట్రంలో మరోసారి ఏకీకృ త అభివృద్ధి ఏర్పడుతుందని, ఫలితంగా రాష్ట్ర వేర్పాటు వాదం మరోసారి తెరమీదకి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటూ.. ఏపీసీఎం జగన్ మూడు రాజధానులకు పిలుపు ఇచ్చిన దరిమిలా.. ఇక్కడ ఊపందుకున్న ఉద్యమం గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ఒక విధంగా సాగిన అమరావతి ఉద్యమం.. ఇప్పుడు రూపు మార్చుకుంది. మరో వ్యూహం ప్రకారం ఇక్కడ మరో వివాదం చోటు చేసుకుంది.
అమరావతికి శంకుస్థాపన జరిగి.. ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరు నుంచి ఉద్దండరాయుని పాలెంలోని అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతం వరకు రైతులు, అమరావతి కోసం ఉద్యమిస్తున్న వారు.. మహా పాదయాత్ర పేరుతో ఉద్యమించారు. దీనికి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. స్వతంత్ర దేశంలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి.. అనుమతులు ఇచ్చింది.
ఈ సమయంలోనే మరో ఉద్యమ నేతలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బహుజన పరిరక్షణ సమితి ఏర్పడిన మంగళగిరికి చెందిన నేతలు యాంటీ ఉద్యమం ప్రారంభించారు. మూడు రాజధానులకు మద్దతుగా వారు కూడా పాదయాత్రను ప్రారంభించారు. దీనికి కూడా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వారు కూడా అదే ప్రాంతంలో పాదయాత్రకు సిద్ధమయ్యారు. దీంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర వివాదానికి తెరదీసినట్టు అయింది. నిజానికి ఇలాంటి ఉద్యమాలు గతంలోనూ జరిగాయి.
అంటే.. కేవలం అమరావతిలోనే అభివృద్ధి కాకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో మేం ఉద్యమిస్తున్నాం.. ఇందులో తప్పేంటి? అన్నది వీరి వాదన. దీనికి ఎవరూ అడ్డు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా అమరావతి ఉద్యమం మరింతగా డైల్యూట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో మున్ముందు మరిన్ని ఉద్యమాలు, ఉద్రిక్తతలకు అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.