తెలుగు ఫిల్మ్ ట్రేడ్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఎట్టకేలకు పూర్తైంది. ఉదయం 7 గంటల నుంచి ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఈసారి అధ్యక్ష పదవి కోసం సి.కల్యాణ్, దిల్ రాజు ల మధ్య వార్ నడిచింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ కీలక ఎన్నికల్లో మొత్తం 1567 మంది సభ్యుల ఓట్లలో దిల్ రాజుకు 563, సీ కల్యాణ్ కు 497 వచ్చాయి. ఈ క్రమంలో జరిగిన పోటీలో దిల్ రాజు గెలుపొందారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు, స్టూడియో ఓనర్‌లతో సహా పరిశ్రమలోని వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎన్నికైన సభ్యులు 2023 నుంచి 2025 మధ్య కాలానికి సేవలందిస్తారు. ప్రొడ్యూసర్ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్ గెలుపొందింది.
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో రెండు ప్యానల్స్ నుంచి చెరో ఆరుగురు గెలుపును అందుకున్నారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కూడా దిల్‌రాజుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.స్టూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్ వారే కావడం విశేషం. నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి 12 మందిలో ఏడుగురు గెలుపొందారు. దిల్‌రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, పద్మిని, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్‌లు నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి గెలిచారు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది.