ముస్లింలంతా బీజేపీ వైపే ఉన్నారు
ఆ పాటి దానికి ఎంఐఎం చేసిందేమీ లేదు
అని అనుకోండి కమలనాథులూ తప్పేం లేదు
ఆ మాటకు వస్తే దేశం మొత్తం మీ వైపే కాదనం
అని అంటున్నాయి విపక్ష రాజకీయ పార్టీలు
యూపీ ఎన్నికల్లో అంతా అల్లకల్లోల రాజకీయం రాజ్యమేలిందని అనుకోకూడదు.ఎందుకంటే ఆ విధంగా అనుకున్నా ఎక్కడయినా నోరు జారినా బీజేపీకి కోపం వస్తుంది.బీజేపీతో పాటే యోగికి మరియు మోడీకి కోపం వస్తుంది.మన హైద్రాబాదీ కిషన్ రెడ్డికి కూడా కోపం వస్తుంది.ఆ లెక్కన చూసుకుంటే ఎవరి కోపాలు తాపాలు ప్రకోపాలు ఎలా ఉన్నా కూడా బీజేపీకి నమ్మకం అయిన నేస్తం ఎంఐఎం అని తేలిపోయింది.ఆ నమ్మకానికి ప్రతీకగా ప్రతీ ఎన్నికల్లో సాయం చేస్తూనే ఉంది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రాలోవైఎస్సార్ కు సాయం చేసిన విధంగా ఈ రోజు తెలంగాణలో కేసీఆర్ సర్ కు సాయం చేసిన విధంగా ఇప్పుడు కూడా యూపీలో చాలా అంటే చాలా చోట్ల ఎంఐఎం పార్టీ బీజేపీకి సాయం చేసి రుణం తీర్చుకుంది.
స్నేహాస్తం అందించి తన ప్రేమకూ మరియు అభిమానానికీ తిరుగు లేదని కూడా నిరూపించింది.అయినా కూడా ఎంఐఎం మాత్రం ఇవేవీ నిజాలు కావని తమకు తమ ఎదుగుదలే ముఖ్యమని చెప్పడంలో నిజం కన్నాఅబద్ధమే ఎక్కువగా ఉంది. ఆ మాట ఓవైసీ సోదరులు ఒప్పుకోరు అన్నది కూడా ఓ వాస్తవం.
కానీ బీజేపీ లెక్కలు వేరుగానే ఉన్నాయి తమకు ఎంఐఎం సాయం చేయలేదనే అంటోంది.ఎస్పీ తరఫున 34 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు అని,తమతో పోలిస్తే మిగతా పార్టీలకే ఎంఐఎం ఎక్కువ సాయం చేసి ఉండవచ్చని బీజేపీ కొత్త లెక్క ఒకటి తీస్తోంది. అదేవిధంగా చాలా చోట్ల గతంలో కన్నా ఎంఐఎం ప్రభావం బీజేపీపై ఎక్కువగానే ఉందని, కానీ అంతా అనుకున్న విధంగా తమకు ఎంఐఎం సాయం చేయలేదు అనేందుకు ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయని అంటోంది బీజేపీ సానుకూల మీడియా మరియు వారి ప్రతినిధి వర్గం. మరోవైపు ఓట్ల చీలికల్లో ఒక్క శాతం ప్రభావం ఉన్నాదానిని ఏమాత్రం కొట్టిపారేయలేం అని మెజార్టీని ప్రభావితం చేసే స్థాయిలో గెలుపును నిర్ణయించే దిశలో ఎంఐఎం ఇవాళ్టికీ బీజేపీకి సాయం చేస్తూనే ఉందన్నది ఇంకొందరి వాదన.