పాపం ! పంటి నొప్పితో ఆయన చాలా కాలం బాధపడ్డారు. ఢిల్లీకి పోయారు. వైద్యం చేయించుకున్నారు. ఆ మధ్య కూడా ఏదో సుస్తీ చేసింది. కానీ ఆయన గాంధీకి పోలేదు ఉస్మానియాకూ పోలేదు. సోమాజీగూడ యశోదకు పోయారు. ఖరీదయిన మనిషి కేసీఆర్ అని అనిపించుకున్నారు. ఆ మాటకు వస్తే మా గవర్నర్ (ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ) కు కూడా సర్కారు వైద్యం పడదు. ఆయన కూడా కరోనా వస్తే ఆకాశ మార్గం కార్పొరేట్ ఆస్పత్రికి చేరుకున్నారు.ఆ విధంగా ఆయన కూడా ఖరీదయిన మనిషే ! జగన్ కూడా ఖరీదయిన మనిషే ! ఎందుకంటే ఆయన కూడా సర్కారు వైద్యంకు పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఈ విధంగా ఎవ్వరి గురించి చెప్పుకున్నా ఖరీదయిన మనుషులే కనిపిస్తారు.
వీరికి కాస్త మినహాయింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన మాత్రం కరోనా లక్షణాలు కనిపించగానే రిమ్స్ లో జాయిన్ అయ్యారు. వైద్యం అందుకున్నాక ఆస్పత్రి సేవలను దగ్గరుండి చూశాక ఆయన అక్కడి వారిని ఎంతో అభినందించి వెళ్లారు. పేదలెవ్వరూ దయచేసి ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్ల వద్దని చెప్పి, అక్కడి వైద్య నారాయణులను చేతులెత్తి మొక్కారు. మరి! హరీశ్ రావు మాత్రం ఉస్మానియాకు ఆధునిక హంగులు కల్పించాం అని అంటున్నారు. ఆయన అయినా ఎప్పుడయినా ఇక్కడి సేవలు పొందేందుకు ప్రాధాన్యం ఇస్తారంటారా? అంటే అమాత్యులకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై నమ్మకం లేదా ? ఇదే ప్రశ్న ఇవాళ అందరినీ వేధిస్తోంది.
ఎందుకంటే ఇప్పుడు ఉస్మానియాకు ఆధునిక హంగులు సమకూర్చారు హరీశ్ రావు. కీలక శస్త్ర చికిత్సలు అయిన కిడ్నీ మార్పిడి, మోకీళ్లు, తుంటి మార్పిడి వంటి శస్త్ర చికిత్సలకు (ఖరీదైన శస్త్ర చికిత్సలకు) ఇకపై ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లవద్దని పేదలను ఉద్దేశించి చెబుతున్నారు. అంతా బాగుంది రేపటి వేళ మన అమాత్యులు ఏదయినా సుస్తీ చేస్తే గాంధీకి కానీ ఉస్మానియాకు కానీ వెళ్తారంటారా? ఆయనెందుకు కానీ ఇండియాలో టాప్ మోస్ట్ హెల్త్ పాలసీని అందిస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయించుకుంటారా పోనీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరి పేట పీహెచ్సీలు ఎలా ఉన్నాయో అయినా ఆమెకు తెలుసా ? ఓహో ! అక్కడికి వెళ్లే మీడియా పట్టించుకోదు కదూ! అందుకే గుంటూరు జీజీహెచ్ కు పోయి ఓ గంట పాటు హంగామా చేసి వచ్చేశారు ఆమె. ఆ విధంగా ఖరీదయిన వ్యక్తులు ఎందరెందరో రాజకీయాల్లో ఉన్నారు మనమే పట్టించుకోవడం లేదు. ఏమంటారు ?