హుజూరాబాద్ లో చేపల పిల్లల పంపిణీ

హుజూరాబాద్ నియోజక వర్గం లోని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట గుండ్ల చెరువులో చేప పిల్లలు వేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాజీనామా చేసినందుకు చేప పిల్లలు వస్తున్నాయని ఈటెల చెబుతున్నాడని.. చేప పిల్లల పంపిణి కార్యక్రమం ప్రభుత్వం ఏమైన కొత్తగా చేపట్టిందా..? అని ప్రశ్నించారు.

స్వయం పాలన రావడం ఎంత ముఖ్యమో మనకు ఇప్పుడు అర్ధం అవుతుందని.. తెలంగాణలో కుల వృత్తుల మీద ఆధార పడి జీవన ప్రమాణాలు ఉంటాయన్నారు. కుల వృత్తులను అన్ని విధాలుగా ఆదుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. చేప పిల్లలను ఉచితంగా పంపిణి చేయాలని కేసీఆర్ కు ఎవరు చెప్పలేదని పేర్కొన్నారు.

90 కోట్ల చేప పిల్లల సీడ్, 25కోట్ల రొయ్యల సీడ్ పంపిణి చేస్తున్నామన్నారు. 66 వేల మందికి ద్వీ చక్ర వాహనాలు, టాటా ఏస్, డి సిఎమ్, టెంపో లు, జాలర్లు, జాకెట్లు అందించిన ఘనత టీఆరెఎస్ దేనన్నారు. నీటి మీద పూర్తి హక్కులు మత్స్యకారులకు ఉండాలని కేసీఆర్ జీవో తెచ్చారని.. వారికి మార్కెటింగ్ స్పెషాలిటీ కల్పించడం కోసం కృషి చేస్తున్నామని వివరించారు.