మల్లారెడ్డి కొంపముంచిన రేవంత్.. మంత్రి పదవి ఆ ఎమ్మెల్యేకేనా…

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మల్లారెడ్డి…టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల మధ్య ఎలాంటి వార్ నడిచిందో అందరికీ తెలిసిందే. మొదట నుంచి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి…ఇటీవల ఆయనపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మల్లారెడ్డి కాలేజీల పేరుతో అనేక అక్రమాలు చేశారని, భూ కబ్జాలు చేశారని ఆరోపించారు. అయితే రేవంత్ ఆరోపణలకు మల్లారెడ్డి కూడా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో రేవంత్, మల్లారెడ్డిల మధ్య బూతుల యుద్ధం జరిగింది.

ఇలా ఇద్దరు నాయకుల మధ్య విమర్శల పర్వం నడిచింది. అయితే ఆ ఎపిసోడ్ నుంచి మల్లారెడ్డి కాస్త సైలెంట్ అయినట్లు కనిపిస్తోంది. అప్పటికే తనని రేవంత్ కావాలని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన చెందిన మల్లారెడ్డి, తర్వాత నుంచి తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా ఉండటం తగ్గించారు. ఇదే క్రమంలో రేవంత్ ఎఫెక్ట్‌తో మల్లారెడ్డి మంత్రి పదవి చిక్కుల్లో పడింది. ఇప్పటికే భూ కబ్జా చేశారని చెప్పి ఈటల రాజేందర్‌ని కే‌సి‌ఆర్ మంత్రి వర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఈటలని రాజకీయ కారణాలతోనే తొలగించారని అందరికీ అర్ధమైంది.

ఎందుకంటే టి‌ఆర్‌ఎస్‌లో అంత స్వచ్చమైన నాయకులు ఎవరూ లేరని విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో మల్లారెడ్డిపై భూ కబ్జాల ఆరోపణలు పెరిగాయి. ఈటలని మంత్రివర్గం నుంచి తొలగించినప్పుడు మల్లారెడ్డిని ఎందుకు తప్పించారని కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఈ క్రమంలోనే మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జోరు అందుకుంది. అయితే మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆ స్థానంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో మల్లారెడ్డికి కూడా క్లారిటీ ఉందని సమాచారం. టి‌ఆర్‌ఎస్ నేతల అంతర్గత సంభాషణల్లో వివేక్‌కు పదవి ఇచ్చినా సంతోషమే అని మల్లారెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి కొంపముంచినట్లే కనిపిస్తోంది.