ఆలయాలకు వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేయడం అందరికీ అలవాటే.. కామన్‌గా అయితే మూడు, పదకొండు చేస్తారు.. ఒకవేళ ఏదైనా మొక్కుకుంటే.. 108 ప్రదక్షిణలు అలా చేస్తారు. అయితే ప్రదక్షిణ ఎలా చేయాలి.. ఎన్ని సార్లు చేయాలి అని సందేహంగా ఉంటుంది. ప్రదక్షిణ గురించి సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
దేవాలయానికి వెళ్లినప్పుడు పాద రక్షలను తీసి పాదాలను శుభ్రంగా కడుక్కుని తల మీద నీళ్లు చల్లుకోవాలి. తరువాత ధ్వజస్తంభానికి నమస్కరించి ఏ దేవాలయానికి వెళ్లామో ఆ దేవుణ్ని మనసులో స్మరించుకుంటూ రెండు చేతులను జోడించి నమస్కారం చేస్తూ సవ్య దిశలో ప్రదక్షిణ చేయాలి. ధర్మ శాస్త్రం ప్రకారం 3, 5, 9, 11, 21, 51, 58, 101, 108.. ఇలా ఈ సంఖ్య ప్రకారమే ప్రదక్షిణ చేయాలి. అదే విధంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభం విడిచి ప్రదక్షిణ చేయకూడదు. అయితే ప్రదక్షిణ అన్ని ఆలయాల్లో ఒక విధంగా శివాలయంలో మరో విధంగా చేయాలి. అన్నీ ఆలయాల్లో చేసినట్టు శివాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో లింగ పురాణంలో సవివరంగా చెప్పారు..
శివాలయానికి వెళ్లినప్పుడు ధ్వజ స్తంభం దగ్గరి నుంచి మనకు ఎడమ వైపుగా బయలుదేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం (శివలింగానికి అభిషేకించిన నీరు బయటకు పోయే మార్గం) వరకు వెళ్లి ఆ సోమసూత్రం నుండి వెనుకకు తిరిగి అప్రదక్షిణంగా ధ్వజ స్తంభాన్ని చుట్టుకుని మరలా సోమసూత్రం వరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తి చేసినట్టు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సోమసూత్రాన్ని దాటకూడదు. ఒకవేళ సోమసూత్రాన్ని దాటి ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక్క ప్రదక్షిణ కిందికే వస్తుందట.
మన శాస్త్రాల ప్రకారం.. మొత్తంగా ఆరు రకాల ప్రదక్షిణలు ఉంటాయి. సాధారణంగా గుడి చుట్టూ నడుచుకుంటూ చేసే ప్రదక్షిణను పాద ప్రదక్షిణ అంటారు. మనం పూజ మందిరంలో పూజ చేసేటప్పుడు అక్కడే మూడు సార్లు తమ చుట్టూ తాము తిరిగే దానిని ఆత్మ ప్రదక్షిణ అంటారు. దండ ప్రమాణాలు చేసే ప్రదక్షిణను దండ ప్రదక్షిణ అంటారు. అన్ని అవయవాలు నేలకు తాకుతూ చేసే ప్రదక్షిణను అంగ ప్రదక్షిణ అంటారు. దేవుడు కొలువు తీరిన కొండ చుట్టూ చేసే ప్రదక్షిణను గిరి ప్రదక్షిణ అంటారు..ఇలా దేవుడి చుట్టూ ప్రదక్షిణలను చేయాలనమాట..!