phone: ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ ఫోన్ మనతోనే ఉంటుంది.. అవసరాలు అలా మారిపోయాయి ఏం చేస్తాం.. ఇంతకుముందు ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే.. పర్సు పెట్టుకెళ్లేవాళ్లం.. పొరపాటున పర్సు మర్చిపోయామంటే.. ఏ పని కాదు.. కానీ ఇప్పుడు అవసరం లేదు.. ఫోన్ ఉండి అందులో నెట్ బ్యాలెన్స్ అకౌంట్‌లో సరిపడా పైసల్ ఉంటే చాలు.. వీధి చివరకేంటి.. విమానం అయినా ఎక్కేయొచ్చు.. ఫోన్ ఉంటే చాలు అన్నీ అయిపోతాయి. ఇలా కారణమేదైనా మొబైల్‌ని మితిమీరి వాడడం వల్ల పలు మానసిక, శారీరక సమస్యలు వస్తున్నాయి.. ఫోన్ లేకుండా మీరు ఉండలేకకపోతున్నారు తెలుసా..? అవసరం లేకుంటే.. సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. అందుకే ‘ఫోన్ హాలిడే’ తీసుకోమంటున్నారు నిపుణులు.
క్రమంగా తగ్గించండి..!
ఏ అలవాటైనా సరే ఒక్కసారిగా మానుకోవడం కాస్త కష్టమే. స్మార్ట్ ఫోన్‌కు విపరీతంగా అలవాటు పడిన వారు కూడా ఒకేసారి దాన్ని మానలేరు. అందుకే క్రమంగా తగ్గించడం అలవాటు చేసుకోండి… ఉదాహరణకు ప్రస్తుతం ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూడడం మీ అలవాటైతే.. దానిని 1 గంటకు మార్చుకోండి. కొద్దిరోజుల తర్వాత దానిని 2 గంటలకు పెంచండి. దీనివల్ల మీకు అధికంగా ఫోన్‌ను ఉపయోగించే అలవాటు క్రమంగా దూరమవుతుంది. అవసరం ఉంది అంటే.. ఓకే.. లేకుంటే తగ్గించే ప్రయత్నం చేయండి.
ఎంతసేపు వాడుతున్నారో చూసుకోండి..
మన ఫోన్‌లో ఏ యాప్ ఎంత సేపు వాడుతున్నామో కూడా తెలుసుకోవచ్చు. అలాగే మొత్తంగా స్క్రీన్ టైమ్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు.. మీ స్ర్రీన్ టైమ్ ఎంతో చూడండి.. దీనివల్ల రోజులో మీరు ఎంత సమయం ఫోన్‌పై వెచ్చిస్తున్నారో సులభంగా అర్థమవుతుంది. అంతేకాదు.. గంటలో ఎన్నిసార్లు ఫోన్‌ని వాడారు? ఎంత సమయం గడిపారు..? తదితర విషయాలను ట్రాక్ చేసే మొబైల్ యాప్స్ ప్లే స్టోర్‌లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవడానికి ఇవీ ఉపయోగపడతాయి.
ప్లానింగ్ ఉండాలి..
రోజులో ఫోన్‌ను ఎంతసేపు వాడాలి? ఏ సమయంలో వాడాలి..? మొదలైన విషయాలపై సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రతిరోజూ ఆ ప్రణాళిక ప్రకారమే ఫోన్‌ను ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు మీరు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఫోన్ వాడాలని నిర్ణయించుకున్నారు. 7 గంటల తర్వాత కచ్చితంగా ఫోన్‌ను పక్కన పెట్టాలి. దీనికోసం మీరు అలారం కూడా పెట్టుకోవచ్చు. సోషల్ మీడియా ఇన్‌స్టా, ఫేస్‌బుక్ లాంటివి అయితే.. టైమ్ రెస్ట్రెక్షన్ పెట్టుకోవచ్చు. దాన్నిబట్టి మీరు ఎంత టైమ్ పెడితే అంత టైమ్ అయిన తర్వాత వార్నింగ్ పాప్‌అప్ వచ్చేస్తుంది.
ఫోన్‌ను దూరంగా ఉంచండి.
మీరు ఆఫీస్‌లో ఉన్నప్పుడు.. చదువుకుంటున్నప్పడు లేదా మరో ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు.. ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల మీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పనిపై పూర్తి దృష్టి పెట్టగలుగుతారు. తద్వారా ఫోన్ వాడకం కూడా తగ్గుతుంది.
ఫోన్ హాలిడే..
ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా..? ఏ పనికి అయినా ఒక రోజం సెలవు ఉంటుంది.. మరీ ఫోన్‌కు కూడా ఇవ్వాలిగా.. వారం అంతా వాడేస్తాం..
అందుకే కనీసం వారాంతాల్లోనైనా ఫోన్‌ను పూర్తిగా పక్కన పెట్టి వేరే పనులపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఈ సమయంలో మీరు మీ సన్నిహితుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా.. మీరు ఫోన్‌కు దూరంగా ఉండబోతున్నారనే విషయాన్ని ముందుగానే వారికి తెలియజేయండి. మరీ అత్యవసరమైతే తప్ప ఫోన్లో సంప్రదించద్దని ముందుగానే సూచించండి. వీక్ ఆఫ్‌లో వీలైనంత వరకూ ఫోన్‌ను వాడకండి.
ఇలా మీకు మీరే ఫోన్‌ను వాడటం తగ్గించుకుంటే.. ఆయుష్షు ఇంకాస్త పెరుగుతుంది. రోగాలు త్వరగా రావు.. ఈరోజుల్లో ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి.. దాని మితిమీరి వాడటం వల్ల అన్ని అనర్ధాలు కూడా ఉన్నాయి.. కంట్రోల్ లేకపోతే ఏదైనా ప్రమాదమే..!