ప్రతి పూజలోనూ గణపయ్యను మొదటగా పూజిస్తారు.. ఆది దేవుడిగా పూజలు అందుకుంటాడు.. కాణిపాకం మొదలు ఎన్నో వినాయక ఆలయాలు.. అయితే తమిళనాడు నాగర్ కోయిల్ జిల్లా కేరళపురంలో ఉన్న పార్వతీతనయుడి ఆలయం మాత్రం ప్రత్యేకం.. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన గణపయ్య ఆరు నెలలకోసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం అంటే మార్చి నుంచి జూన్ వరకూ నల్ల రంగులో, దక్షిణాయన కాలం అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని ప్రత్యేకతగా అక్కడి ప్రజలు చెప్పుకోస్తున్నారు..
అంతేకాదు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది.. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ మిగిలిన చోట్ల మాటేమో కానీ ఇక్కడ నీటికి కూడా రంగులు మారుతాయ్. స్వామివారు రంగులు మార్చుకున్నట్టే బావిలో నీళ్లు కూడా రంగులు మారుతాయి. అయితే స్వామివారి రంగులకు..బావిలో నీళ్ల రంగులు వ్యతిరేకంగా ఉంటాయి. అంటే వినాయకుడు నల్లగా ఉంటే బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి..
ఈ ఆలయంలో మర్రి చెట్టు ఒకటి ఉంది.. కాలాలకు వ్యతిరేకంగా చిగురిస్తుంది..ఇది 12వ శతాబ్ద కాలం నాటిదని, 1317 సంవత్సరంలో నిర్మించారని.. 2300 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు.. తమిళనాదులోకి ఈ ఆలయం రావడంతో అభివృద్ధి చెందింది..