కరోనా వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రోజురోజుకు వైరస్ ప్రభావం పెరిగిపోతుండటంతో ప్రజల దైనందిన జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది, దాని బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే విషయాలను వైద్యులు, ప్రభుత్వాలు అదేపనిగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంకా చాలామందిలో అపోహలు తొలగిపోవడంలేదు. ఏం చేస్తే కరోనా వస్తుంది.. ఏది చేయవచ్చు.. ఏది చేయకూడదు అనే విషయాల్లో క్లారిటీలేక చాలామంది ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా బయటకు చెప్పుకోలేని విషయాల్లో జనం అపోహలు పెరిగిపోతున్నాయి. శృంగారంలో పాల్గొంటే కూడా కరోనా వస్తుందోమోనన్న అనుమానం చాలామందిలో ఉన్నది. అయితే, శృంగారంవల్ల కరోనా వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, శారీరకంగా కలిసిన ఇద్దరిలో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్‌గా ఉన్నా మరొకరికి ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే, అందుకు ఒకరి శ్వాసను మరొకరు పీల్చుకోవడమే కారణం తప్ప లైంగిక చర్య కాదని స్పష్టం చేస్తున్నారు.
కరోనా వైరస్ ప్రభావం ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ఏ మాత్రం ఉండదని, అది ప్రధానంగా శ్వాసవ్యవస్థ మీదనే దాడి చేస్తుందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. కాబట్టి లైంగిక భాగస్వాములిద్దరూ కరోనా లక్షణాలు లేనివారైతే నిశ్చింతంగా శృంగారంలో పాల్గొనవచ్చు. అనసవర ఆందోళనలు, భయాలను పక్కనపెట్టి శృంగార అనుభూతులను ఆస్వాదించవచ్చు.