జూన్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన లాక్‌డౌన్ 5.0లో అనేక ఆంక్షలకు సడలింపులు ఇచ్చారు. అందులో భాగంగానే తెలంగాణలోనూ అనేక కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. దీంతో ప్రజాప్రతినిధులంతా తమ పార్టీ శ్రేణులతో నిత్యం పలు కార్యక్రమాలతో బిజీగా గడుపుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతుండడం, మరోవైపు ఇప్పటికే ముగ్గురు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడి చికిత్స పొందుతుండడంతో.. ఇతర నేతలకు కరోనా భయం పట్టుకుందని అంటున్నారు.
గత 10 రోజుల నుంచి తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. లాక్‌డౌన్ సమయంలో కరోనా కంట్రోల్‌లోనే ఉన్నా.. అన్‌లాక్ 1.0లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో కేవలం జీహెచ్ఎంసీకి మాత్రమే కేసులు పరిమితం అయ్యాయి. కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పుడు కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. మరోవైపు ఆంక్షలకు సడలింపులు ఇచ్చాక నేతలు పర్యటనలు, అధికారిక కార్యక్రమాలతో బిజీగా గడిపారు. అయితే ఆయా కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటించలేదని, అందుకనే నేతలకు కరోనా సోకిందనే వార్తలూ వస్తున్నాయి. దీంతో నేతలు కరోనా అంటేనే జంకుతున్నట్లు తెలిసింది. ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలుంటే తప్ప వారు బయటకు రావడం లేదు. దాదాపుగా పనులన్నీ ఫోన్లోనే కానిచ్చేస్తున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు కూడా కరోనా బారిన పడడం నేతలకు నిద్ర లేకుండా చేస్తోందట. దీనిపై వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తాము పాల్గొన్న కార్యక్రమాల్లో ఎవరి ద్వారా అయినా తమకు కరోనా వచ్చిందేమోనని, పాల్గొంటే వస్తుందేమోనని వారు కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 20 నుంచి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో రెండు రోజుల్లో కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. మరి దాంట్లో ప్రజాప్రతినిధులు ఏవిధంగా పాల్గొంటారో చూడాలి. ఏది ఏమైనా.. వారు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. భౌతిక దూరం నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అలాగే మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అలా లేకపోతే.. కార్యక్రమాల్లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా కచ్చితంగా వైరస్ వస్తుంది. ఆ తరువాత బాధపడీ ప్రయోజనం ఉండదు. కనుక అది రాకముందే జాగ్రత్తలు వహిస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదు..!