తాగుబోతు తాగి రచ్చ చేశాడు. ఇదేదో బార్ లోనో, రెస్టారెంట్, ఇంట్లోనో కాదు. ఏకంగా అంతర్జాతీయ విమానంలో రచ్చ చేశాడు. దీంతో చేసేందేం లేక ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు పైలెట్లు. ఈ ఘటన దోహ- బెంగళూర్ విమానంలో జరిగింది. విమానంలో తాగుబోతు ప్రయాణీకుడు గొడవ సృష్టించాడు. పోలీసులు కథనం ప్రకారం దోహ- బెంగళూర్ విమానం ఆకాశంలో ఉన్న సమయంలో కేరళకు చెందిన సర్పుద్దీన్ ఉల్వార్ అనే వ్యక్తి తాగి విమాన సిబ్బందితో, తోటి ప్రయాణికులతో గోడవ పడ్డాడు. ఎయిర్ హోస్టెస్ మద్యం సేవించకుండా అడ్డుకున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డాడు. తొలి ప్రయాణికులను కూడా దుర్భాషలాడుతూ… అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారితో గొడవ పడ్డాడు.
దీంతో తాగుబోతు రాద్ధాంతం వల్ల విమానాన్ని మళ్లించాల్సి వచ్చింది. అత్యవసరంగా ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమాన దిగిన వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది సర్పుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద ఆయనను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.