మలేరియా నివారణలో వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు.. కరోనా నియంత్రణలో ప్రభావం చూపుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఆ జౌషధాల ఎగుమతిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికాలో కరోనా వైరస్.. మరణ మృదంగం మోగిస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులను తమకు అందించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోరారు. మోదీతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు కావాలని అగినట్టు ట్రంప్ వెల్లండించారు.
తమ కోరికను భారత్ సీరియస్ పరిశీలిస్తుందని ట్రంప్ చెప్పారు. ఇండియా భారీ మొత్తంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను తమకు రిలీజ్ చేస్తుందని ఆశిస్తున్నామని ట్రంప్ తెలిపారు. కాగా, శనివారం కరోనా వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాలపై ట్రంప్, మోదీలు ఫోన్‌లో చర్చలు జరిపారు. కలిసికట్టుగా కరోనాపై పోరాడాలని నేతలు అభిప్రాయపడ్డారు. మరోవైపు కరోనాను అరికట్టేందుకు మలేరియా డ్రగ్ కొంత వరకు పనిచేస్తుందని అమెరికా విశ్వసిస్తున్నది.
ట్రంప్ కూడా తమ దేశ పౌరులను కరోనా బారి నుంచి రక్షించడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుని అయినా ఈ గండం నుంచి బయటపడాలని ఆయన భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. దాదాపు 8 వేల మందికి పైగా మృతిచెందారు.